జాసన్ రాయ్ సంచలన నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 

జాసన్ రాయ్ సంచలన నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై! 

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జాసన్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ క్రికెట్ కోసం అతడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీకి చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌తో రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయాలకు రాయ్ డీల్ కుదుర్చుకున్నట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాన్ని ప్రచురించింది. అదే వాస్తవమైతే రాయ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే.

అమెరికా వేదికగా జులై 13 నుంచి జూలై 30 వరకు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరగనుంది. ఐపీఎల్ ఫ్రాంచేజీలే ఈ టోర్నీలో భాగమయ్యాయి. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, సీటెల్ ఓర్కాస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం.. ఇలా ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ఈ టోర్నీలో ఆడేందుకు రాయ్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని డెయిలీ మెయిల్ వైబ్ సైట్ పేర్కొంది. ఈ విషయమై రాయ్ ఇప్పటికే ఈసీబీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

2023 వన్డే ప్రపంచకప్‌కు దూరం..

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో రాయ్ తన కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటే ఈ ఏడాది భారత్ వేదికగా జరిగబోయే వన్డే ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. అదే జరిగితే ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద లోటే అని చెప్పొచ్చు. సొంతగడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ ఇంగ్లండ్ తరుపున 116 వన్డేలు ఆడిన రాయ్ 39.92 సగటుతో 4271 పరుగులు చేశాడు.