
చైనా జనాభా అంతకంతకూ తగ్గుతోంది. గతంలో ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. అంతేకాదు గత కొంతకాలంగా చైనాలో జననాల రేటు, వివాహాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ విషయాన్ని సీఎన్ఎన్ నివేదిక వెల్లడించింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల సంఖ్య 2021తో పోల్చుకుంటే 2022లో 10 శాతం మేర తగ్గింది. 2021లో చైనావ్యాప్తంగా 7.3 బిలియన్ వివాహాలు జరగగా.. 2022లో వాటి సంఖ్య 6.8 బిలియన్లకు పడిపోయింది.
చైనాలో ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం.. కరోనా మహమ్మారి. కోవిడ్ నివారణ కోసం నెలల తరబడి లాక్ డౌన్ విధించడం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా చైనాలో జనాభా తగ్గడమే కాక పెళ్లి చేసుకునే వారి సంఖ్య కూడా పడిపోయింది. 2021లో చైనాలో జననాల సంఖ్య 7.63 ఉండగా.. 2022 నాటికి అది 6.77కి పడిపోయింది. ఇదిలావుంటే ప్రస్తుతం చైనాలో మరణాల రేటు ప్రతి 1000 మందికి 7.52గా ఉంది.
దాదాపు 60 సంవత్సరాల తర్వాత(2022) చైనా జనాభా గణనీయంగా తగ్గింది. అందుకు ప్రధాన కారణం పెరుగుతున్న జీవన వ్యయాలు మాత్రమే కాకుండా, బీజింగ్ వంటి పెద్ద నగరాల్లో కుటుంబ పోషణ ఖర్చు విపరీతంగా పెరిగింది. అలాగే జనాభా తగ్గడానికి చైనా ప్రభుత్వం కొనసాగించిన 'ఒకే బిడ్డ' విధానం కూడా ఒక కారణమే అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి డ్రాగన్ కంట్రీ ఆ విధానాన్ని దేశ జనాభాను పెంచడం కోసం 'వన్ చైల్డ్' విధానాన్ని ఎత్తి వేయడమే కాక.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేందుకు అనేక సదుపాయాలు కల్పిస్తోంది.