పాక్ పోరుకు సిద్ధమవుతున్న భారత బ్యాటర్లు.. ఏకంగా 15 మంది బౌలర్లతో ప్రాక్టీస్

పాక్ పోరుకు సిద్ధమవుతున్న భారత బ్యాటర్లు.. ఏకంగా 15 మంది బౌలర్లతో ప్రాక్టీస్

ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 సమరానికి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ప్రారంభం కావడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలివుండగా.. అన్ని జట్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు వారి వారి జట్లను ప్రకటించగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక బోర్డులు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. 

ఇదిలావుంటే భారత ఆటగాళ్లు ఈసారి గత ఎడిషన్‌లో ఎదురైన ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. అందుకోసం ఏకంగా 15 మంది బౌలర్లతో నెట్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు.  వీరిలో ఉమ్రాన్ మాలిక్, యష్ ధయాల్, కుల్దీప్ సేన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, షామ్స్ ములానీ సహా మరికొందరు ఉన్నారు. బెంగుళూరు, ఆలూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఈ సన్నద్దత జరుగుతోంది.

కాగా, ఆసియాకప్ 2023 టోర్నీ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత జట్టు సెప్టెంబర్ 2న దాయాది పాకిస్తాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది.