కోహ్లీతో వివాదం: గంభీర్‌పై వేటు పడే అవకాశం!

కోహ్లీతో వివాదం: గంభీర్‌పై వేటు పడే అవకాశం!

ఐపీఎల్ 2023లో సీజన్‌లో చెప్పుకోదగ్గ ఘటనలు రెండే రెండు. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడం, మరొకటి కోహ్లీ - గంబీర్ గొడవ. మొదట 'విరాట్ కోహ్లీ', అఫ్గాన్ క్రికెటర్ 'నవీన్ ఉల్ హక్' మధ్య మాటలతో మొదలైన ఈ వివాదం.. గౌతం గంభీర్ ఎంట్రీతో పెద్ద గొడవగా మారిపోయింది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణకు దిగారు. ఈ ఘటనను టోర్నీకే మాయని మచ్చని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొనడం గమనార్హం.  

విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ ఇద్దరూ దూకుడు స్వభావం కలవారే. ఓటమిని ఎవ్వరూ అంత తేలిగ్గా అంగీకరించరు. అభిమానులకు ఇది మంచి ఎనర్జీని అందించేదే అయినా.. ప్రేక్షకుల నడుమ మైదానంలో గొడవపడటం మాత్రం అంగీకరించదిగింది కాదు. ఈ వివాదంలో కోహ్లీది ఎంత తప్పో.. గంభీర్‌ది అంతే తప్పు. తన సీనియర్ ఆటగాడికి కనీస మర్యాద కూడా ఇవ్వకపోవటం కోహ్లీ చేసిన తప్పైతే.. తనకంటే చిన్నవాడితో వాదనకు దిగటం గంభీర్ చేసిన తప్పు.

ఈ గొడవ తరువాత లక్నోపై అభిమానుల్లో వ్యతిరేకత పెరిగిందట. సొంత అభిమానుల నుంచి కూడా ఆ జట్టుకు ఆదరణ కరువైందట. అందునా గత రెండు సీజన్లలో జట్టు టైటిల్‌ను అందుకోకపోగా.. అనవసర గొడవలతో జట్టు ప్రతిష్టను దిగజార్చరనే అపకీర్తిని గంభీర్‌పై నెడుతున్నారు. ఈ విషయాలు యాజమాన్యం దృష్టికి వచ్చినట్లు సమాచారం. అందుకు దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్నో సోషల్ మీడియా ప్రతినిధిని మార్చగా.. గంభీర్‌పై కూడా వేటుపడనుందనే కథనాలు వస్తున్నాయి. 

ప్రస్తుతం గంభీర్‌.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పదవి నుండి గంభీర్‌ను తొలగించనున్నారట. ఈ విషయంపై గంభీర్‌ వివరణ కూడా కోరనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలను క్రికెట్ విశ్లేషకులు కొట్టి పడేస్తున్నారు. పుకార్లుగా చెప్తున్నారు. ఇవి నిజమో! కాదో తెలియాలంటే ఐపీఎల్ 2024 మినీ వేలం వరకు ఆగాల్సిందే.