
వన్డే ప్రపంచ కప్ 2023కు ముందు జీతాలు చెల్లించాలంటూ పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరిని ఖండించిన విషయం తెలిసిందే. పెండింగ్‌లో జీతాలు చెల్లించడంతో పాటు ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంలో వాటా ఇవ్వాల్సిందేనంటూ పీసీబీని వారు ప్రాధేయపడ్డారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పాక్ హాకీ క్రీడాకారులకు ఎదురవుతోంది. గత ఆరు నెలలుగా పాకిస్తాన్ హాకీ పెడరేషన్ (పీహెచ్ఎఫ్) తమ ఆటగాళ్లకు, సిబ్బందికి జీతాలను చెల్లించడంలో విఫలమైందట.
లాహోర్‌లోని పాక్ హాకీ పెడరేషన్ ప్రధాన కార్యాలయం, కరాచీలోని సబ్-ఆఫీస్‌లోని ఉద్యోగులందరూ గత ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది వరకు కార్యాలయ, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆటగాళ్లకు సైతం గత నాలుగైదు నెలలుగా జీతాలు, వైద్య ప్రయోజనాలు అందడం లేదని సమాచారం. ఇటీవల ఒమన్ వేదికగా జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న వారికి కూడా జీతాలు లేదా అలవెన్సులు చెల్లించలేదట. ఈ విషయమై కెప్టెన్ ఇమాద్ షకీల్ బట్ సహా మరికొందరు ఆటగాళ్లు మేనేజ్‌మెంట్‌తో గొడవ పడ్డారని సమాచారం. తమ రోజువారి బకాయిలు చెల్లించే వరకూ తదుపరి మ్యాచులు ఆడబోమని వారు హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి.
పాక్ హాకీ పెడరేషన్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడం ఆపివేసిందని, ఉన్న ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసిందని నివేదికలు చెప్తున్నాయి. నిధుల ఆర్థిక దుర్వినియోగం పై విచారణ కొనసాగుతున్న కారణంగానే ఖాతాలను చేసినట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆటగాళ్లు, కోచ్‌లు, ఇతర సిబ్బందికి కలిపి సుమారు 80 మిలియన్ల పాకిస్తాన్ రూపాయలు చెల్సించాల్సిన ఉందట. ఈ విషయం ఆ దేశ క్రీడా ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.