IPL 2024: SRHకు కొత్త తలనొప్పి.. కనిపించని 10 కోట్ల ఆటగాడి జాడ

IPL 2024: SRHకు కొత్త తలనొప్పి.. కనిపించని 10 కోట్ల ఆటగాడి జాడ

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ కొందరు ఆటగాళ్లు ఆయా ప్రాంచైజీల చెంతకు చేరలేదు. అలాంటి వారిలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ ఆర్ హెచ్) కొనుగోలు చేసిన శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఒక్కరు. వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం రూ.10.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో తాను పూర్తి స్థాయిలో ఐపీఎల్ టోర్నీకి అందుబాటులో ఉంటానని తెలిపిన హసరంగా.. ఇప్పుడు మాత్రం జాడ కనిపించనివ్వడం లేదు.

వనిందు హసరంగ సమస్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో గుబులు రేపుతోంది. ప్రస్తుతానికి జట్టు పరంగా ఎలాంటి సమస్య లేనప్పటికీ.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే.. అప్పుడు ఏంటనేది ఆసక్తికర ప్రశ్న. హసరంగ మంచి ఆల్ రౌండర్. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సమర్థుడు. అలాంటి ఆటగాడి సేవలు కోల్పోతే హైదరాబాద్ జట్టుకు పెద్ద దెబ్బె. 

సన్‌రైజర్స్ ఎదురుచూపులు

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో హసరంగ ఆడారు. ఆపై తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని టెస్ట్ జట్టులో కూడా దక్కించుకున్నారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆంక్షల నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు ఐసీసీ అతన్ని సస్పెండ్ చేసింది. ఇది ముగిసిన తరువాత అయినా.. అతను జట్టులో చేరతాడా..! అంటే అదీ అనుమానమే. 

ప్రస్తుతం హసరంగా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చెకప్ కోసం మార్చి 31న దుబాయ్‌కి వెళ్లే అవకాశం ఉందని, నిపుణుల సలహా మేరకు అతను ఐపీఎల్ జట్టులో చేరడంపై నిర్ణయం తీసుకుంటారని అతని మేనేజర్ వెల్లడించారు. దీన్ని బట్టి అతని రాక మరింత ఆలస్యం అవుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు, అతని నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో మరో ఆటగాడిని ఫ్రాంచైజీ భర్తీని చేయలేకపోతోంది. ఈ విషయంపై స్పందించేందుకు ఫ్రాంచైజీ అధికారులు నిరాకరించడం గమనార్హం.