రాష్ట్రంలో పదోన్నతులను సమీక్షించాలి

రాష్ట్రంలో పదోన్నతులను సమీక్షించాలి

మొదటిసారి1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశపెట్టిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ, ఇంద్ర సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో పదోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయరాదని ఏదైనా ఒక కేడర్లో అసమానులు రిజర్వేషన్ల ద్వారా ఎంపికై సమానులైనప్పుడు తిరిగి వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యం తక్కువ ఉండటాన్ని గమనించి, మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పైస్థాయి ఉద్యోగుల్లో కూడా వారి ప్రాతినిధ్యం ఉండాలని 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్16(4ఏ)ను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు(ఉన్నత స్థాయి పోస్టుల్లో ప్రాతినిధ్యం లేనట్లయితే) పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించింది.

ఈ రాజ్యాంగ సవరణలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్ల ద్వారా పదోన్నతి పొందినప్పుడు వారు పర్యవసానంగా పొందిన సీనియారిటీని ఇవ్వాలా? ఇవ్వకూడదా? అనేది తెలపలేదు. 2001లో 85వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్16(4ఏ) చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్ల ద్వారా పదోన్నతి పొందినప్పుడు తదనంతరం పైస్థాయి పోస్టుల్లో సరిపడా ప్రాతినిధ్యం లేనట్లయితే వారికి పర్యవాసనంగా పొందిన సీనియారిటీని వినియోగించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణల చెల్లుబాటు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 2006లో ఎం. నాగరాజు వర్సెస్ యూనియన్ ఇండియా, 2018లో జర్నల్ సింగ్ వర్సెస్ లచ్చిమి నరేయిన్ గుప్తా  మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 77, 85వ రాజ్యాంగ సవరణలను ఆమోదిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే సమయంలో కొన్ని నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే ముందు పూర్తిస్థాయి కసరత్తు చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ శాఖల నైపుణ్యత దెబ్బతినకుండా, ప్రతి కేడర్ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కగట్టి సరిపడా ప్రాతినిధ్యం లేకుంటేనే పదోన్నతుల్లో రిజర్వేషన్లు, తద్వారా పొందిన పర్యవసాన సీనియారిటీ ఫలితాన్ని వారికి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంజ్ ఉత్తర్వుల ప్రకారం 2019లో అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2 జున్ 2014 నుంచి ఇచ్చిన అన్ని పదోన్నతులను సమీక్షించి అన్ని కేడర్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్​కో, జెన్​కో, ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ సంస్థల్లో కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను అమలు చేయాలని 2019లో తెలంగాణ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వేసిన కేసును విచారించిన న్యాయస్థానం హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను అమలు చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అందుకు బదులుగా 2021లో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఆ కేసు ముగిసిన వెంటనే హైకోర్టు డివిజన్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసింది. తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాల అలసత్వాన్ని వ్యతిరేకిస్తూ సీఎండీలపై కొద్ది నెలల క్రితం పిటిషనర్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేశారు. ఇటీవల విచారించిన హైకోర్టు.. విద్యుబ సంస్థల్లో 2014 జూన్‌‌‌‌‌‌‌‌ 2 నుంచి కల్పించిన పదోన్నతులను సమీక్షించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభినందన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ షావ్లీ ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. వీటి అమలు కోసం 6 నెలలు గడువు కావాలని ప్రతివాదుల తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయగా రెండు నెలల్లో (అక్టోబరు 6)లోగా పదోన్నతులను సమీక్షించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలి. ఒక్క విద్యుత్​ ఉద్యోగుల విషయంలోనే కాదు.. అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో సరైన న్యాయం జరగాలంటే ప్రభుత్వం రాజ్యాంగ, కోర్టు తీర్పులు ప్రకారం.. పదోన్నతులను సమీక్షించి  న్యాయం చేయాలి. 

ఉమ్మడి రాష్ట్రంలో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(2003లో) జారీ చేసిన జీవో నెంబర్లు 5, 21, 2009లో జారీచేసిన జీవో నెం.26 ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు 2003 నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలాంటి కసరత్తు చేయకుండానే పదోన్నతుల్లో రిజర్వేషన్లతో పాటు పర్యవసానంగా పొందే సీనియారిటీతో అమలు చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు జీవో నెంబర్ 26ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్​2011లో జీవో నెం 26ను కొట్టివేస్తూ, సంబంధించిన సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను సవరించలేదు కాబట్టి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని వారికి పర్యవసానంగా పొందే సీనియారిటీని ఇవ్వకూడదని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు చేసింది. హైకోర్టు 2018లో స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎస్. ప్రకాష్ మధ్య జరిగిన కేసు తీర్పులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ, 2009లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 26ను ఆమోదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 5, 21, 26లను సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎలాంటి కసరత్తు చేయకుండా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కించకుండా, ఎస్సీలకు15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 6 శాతం పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పు పట్టింది. 2011 నుంచి కల్పించిన అన్ని పదోన్నతులను సమీక్షించి, ప్రతి కేడర్​లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

- కోడెపాక కుమార స్వామి