గెస్ట్ లేకుండా రిపబ్లిక్ డే.. 55 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

గెస్ట్ లేకుండా రిపబ్లిక్ డే.. 55 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

గడిచిన 55 ఏండ్లలో విదేశీ అతిథి లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ ఇప్పుడే జరగబోతోంది. గతంలో 1966లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ లేరు. ఆ ఏడాది జనవరి 11న తాష్కెంట్‌‌లో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం, ఆ తర్వాత జనవరి 24న ఇందిరా గాంధీ ఆ పదవిలోకి రావడం లాంటి అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ను పిలిచి, ఏర్పాట్లు చేసేందుకు సమయం లేకపోయింది. అయితే ఈ ఏడాది బ్రిటన్‌‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌‌ను గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్‌‌‌‌గా ఆహ్వానించారు. అయితే ఆ దేశం నుంచే ప్రపంచమంతా కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి మొదలవడం, అక్కడ జులై వరకు లాక్‌‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఆయన రావడం లేదు. 1952, 1953లో కూడా ఇలా గెస్ట్ ఆఫ్ ఆనర్ లేకుండా రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌ జరిగింది.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే మనం ఘనంగా జరుపుకొనే వేడుక రిపబ్లిక్‌‌ డే. మన చట్టాలు, మన పాలన, మన విధానాలు, మన శక్తి మీద నిలబడి పాలన చేయడం మొదలై భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఆ రోజును త్రివిధ దళాల పరేడ్‌‌తో సగర్వంగా జరుపుకొంటున్నాం. 1950 నుంచే రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్‌‌‌‌ను ఆహ్వానించే ట్రెడిషన్‌‌ను దేశ తొలి ప్రధాని జవహర్‌‌‌‌లాల్‌‌ నెహ్రూ ప్రారంభించారు. తొలి రిపబ్లిక్ డే పరేడ్‌‌కు చీఫ్ గెస్ట్‌‌గా ఇండోనేషియా తొలి ప్రెసిడెంట్‌‌ సుకర్నో వచ్చారు. ఆ తర్వాతి ఏడాది 1951లో నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షా గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌గా విచ్చేశారు. నాటి నుంచి ఈ విధానాన్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొనసాగిస్తూ వస్తోంది. దీని ద్వారా దౌత్య సంబంధాలు పెంచుకోవడంతో పాటు విదేశాలతో పరస్పరం అనేక విధాలుగా రెండు వైపులా ప్రయోజనాలు కలుగుతున్నాయి.

గతంలో గెస్ట్‌‌ లేని సందర్భాలు

రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌ లేకపోవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. గతంలో 1952, 1953, 1966 సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలు విదేశీ అతిథి లేకుండానే జరిగాయి. 1952లో దేశంలో తొలి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న కారణంగా ఆ ఏడాది రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌ను పిలవడం వీలు కాలేదు. అలాగే 1953లోనూ ఏ విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్‌‌ డే వేడుకులు జరిగాయి. ఇక 1966 నాటి పరిస్థితులు అయితే పూర్తి భిన్నం. 1965లో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాని ముగింపుపై 1965 జనవరి 10న రష్యాలోని తాష్కెంట్‌‌లో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం నాటి ప్రధాని లాల్‌‌బహదూర్ శాస్త్రి ఆ దేశానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాతి రోజే ఆయన మరణించారు. ఆ తర్వాత జనవరి 24న ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు గెస్ట్‌‌ను పిలిచి, గ్రాండ్‌‌గా చేసే వీలు లేకపోవడంతో ఆ ఏడాది విదేశీ గెస్ట్‌‌ లేకుండా పరేడ్ ముగించారు. ఇవి మినహా ప్రతి ఏడాదీ గెస్ట్‌‌ ఆఫ్ ఆనర్ ఎదుట మన సైనిక శక్తి మొదలు, భిన్న సంప్రదాయాల వరకూ అన్నీ ఘనంగా ప్రదర్శిస్తూనే ఉన్నాం. మళ్లీ ఇప్పుడు కరోనా కారణంగా నాలుగోసారి గెస్ట్ లేకుండా రిపబ్లిక్‌‌ డే పరేడ్ జరుగబోతోంది. అయితే పోయిన ఏడాది కూడా గెస్ట్ విషయంలో  కిందా మీదా అయింది. మొదట అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌‌ను అతిథిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంది. కానీ ఆయన మన పిలుపును రిజెక్ట్‌‌ చేయడంతో భారత విదేశాంగ శాఖ  బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారోను ఇన్వైట్ చేసింది. ఈ ఏడాది బోరిస్ జాన్సన్‌ను పిలిచినా కరోనాకారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది.

మన సైనిక శక్తి, కల్చరల్ డైవర్సిటీ ప్రదర్శనకు వేదిక

సొంత కాళ్లపై నిలబడి పరిపాలన చేసుకునే శక్తి వచ్చిన భారత్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్‌‌ డే ఘనంగా నిర్వహించాలన్న ఐడియా స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూదే. విదేశీ అధినేతలను పిలిచి మన దేశ సైనిక శక్తితో పాటు, కల్చరల్ డైవర్సిటీ, రకరకాల నాగరికతలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే వేదికగా ఈ వేడుకను ఆయన తీర్చిదిద్దారు. గెస్ట్‌‌ ఆఫ్  ఆనర్‌‌‌‌గా వచ్చే విదేశాధినేతనే రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు చీఫ్‌‌ గెస్ట్‌‌గా ట్రీట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌‌లో మన ప్రెసిడెంట్‌‌ గెస్ట్ ఆఫ్ ఆనర్‌‌‌‌తో పాటు దేశంలో అన్ని రాజకీయ పక్షాల నేతలతో పాటు పలు రంగాల్లో గొప్ప వ్యక్తులను ఆహ్వానించి ఎట్ హోమ్ పేరుతో విందు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా పెట్టారు. ఆ తర్వాతి రోజు మన ప్రధానమంత్రితో ఆ గెస్ట్ సమావేశమై ఇరు దేశాల సంబంధాలపై చర్చించి, ఆపై తన స్వదేశానికి పయనమవుతారు.

చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకూ..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా ఇటు అమెరికా, అటు యూఎస్ఎస్ఆర్ (నేటి రష్యా) అనే రెండు పవర్ సెంటర్స్‌‌ మధ్య నిట్టనిలువునా చీలింది. ఆ సమయంలో మళ్లీ యుద్ధం రాకుండా చూసే శక్తిగా ఇండియా నిలవడంతో పాటూ చిన్న దేశాలు, వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు లీడర్‌‌‌‌గా నిలిచింది. అటువంటి సమయంలో మన రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌ వేదికగా చిన్న దేశాల ఉనికిని ప్రపంచానికి చాటేలా గెస్టులను ఆహ్వానించారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రభుత్వాధినేతలను పిలుస్తూ వచ్చారు. అంతే కాదు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల లీడర్స్‌‌ ముందు కూడా మన శక్తిని ప్రదర్శించాం.  పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్, సింగపూర్‌‌‌‌ ప్రధాని ఘో చోక్ టోంగ్, సౌతాఫ్రికా ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా లాంటి వాళ్లను రిపబ్లిక్‌‌ డే పరేడ్‌‌కు పిలిచారు. ఇలా ప్రతి ప్రభుత్వం కూడా భిన్నమైన కాంబినేషన్స్ తీసుకుంటూ వచ్చింది.

ఈ ఏడాది ఇలా..

  • ఏటా రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలుకొని ఎర్రకోట వరకూ సాగేది. కానీ ఏడాది తొలిసారిగా కరోనా కారణంగా పరేడ్‌‌ను లిమిటెడ్‌‌గా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లెంత్ కూడా తగ్గిస్తూ పరేడ్‌‌ను నేషనల్ స్టేడియం దగ్గరే ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ ఏడాది పరేడ్‌‌లో పాల్గొనే గెస్టులు, జనాలు కలిపి 25 వేలకు మించకుండా ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. ఫోక్ డ్యాన్సులు, పాటల ప్రదర్శనలు, అందులో పాల్గొనే వారి సంఖ్య గతేడాది 600 ఉండగా ఈ ఇయర్ 400 మందికి తగ్గించారు. జనరల్ పబ్లిక్‌‌ 4 వేల మంది మాత్రమే ఉంటారు.
  • రైతు నిరసనలు సహా ఇతర భద్రతా కారణాల దృష్ట్యా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పరేడ్‌‌కు వచ్చే ప్రతి ఒక్కరూ ఫొటో ఐడీ కార్డు చూపించాల్సిందే.
  • ఈ ఏడాది పరేడ్‌‌లో ప్రత్యేక ఆకర్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు నిలవనున్నాయి. అలాగే తొలి మహిళా ఫైటర్ పైలట్ అయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ ఈ పరేడ్‌‌లో పాల్గొంటున్నారు.-పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్.

ఇవి కూడా చదవండి..

తబలా కొట్టి..రికార్డు పట్టి..!

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు