
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొని 348 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో రివ్యూ చేశారు. అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, హౌజింగ్ పీడీ గంగాధర్, బీజేపీ లీడర్లు రమణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణికి వచ్చే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాజన్న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. . ప్రజావాణిలో మొత్తం 167 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 60 ఫిర్యాదులు స్వీకరించారు.