90 సెం.మీ. స్టీల్​ పైప్​తో .. ఎస్కేప్ రూట్

90 సెం.మీ. స్టీల్​ పైప్​తో .. ఎస్కేప్ రూట్
  • ఉత్తరాఖండ్​ టన్నెల్​లో కొనసాగుతున్న రెస్క్యూ

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో మూడో రోజూ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని సేఫ్​ గా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. ఓవైపు పూడుకుపోయిన శిథిలాలను తొలగిస్తుంటే పైనుంచి మళ్లీ మట్టి కూలుతుండడంతో రెస్క్యూ పనులు ఆలస్యమవుతున్నాయి. భారీ ఎక్స్ కవేటర్లు ఉపయోగిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడంలేదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటలకు వర్కర్లు లోపల చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​బృందాలు రెస్క్యూ పనుల్లో నిమగ్నమయ్యాయి. లోపల చిక్కుకున్న వర్కర్లకు ఓ పైప్ ద్వారా ఆక్సీజన్, తిండి, నీళ్లు అందిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్​సీనియర్ కమాండర్ కరమ్​వీర్ సింగ్ భండారీ తెలిపారు.

వర్కర్లతో శాటిలైట్​ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నామని, మొత్తం 40 మంది వర్కర్లు సేఫ్​ గా ఉన్నారని వివరించారు. కాగా, పైనుంచి మట్టి కూలుతుండడంతో వర్కర్లను బయటకు తీసుకురావడానికి ఇంజనీర్లు ఓ కొత్త ఎస్కేప్ రూట్​ను తయారు చేస్తున్నారు. ఓ భారీ స్టీల్​ పైప్​ను శిథిలాల గుండా లోపలికి పంపి, అందులో నుంచి వర్కర్లు బయటకు వచ్చే మార్గం చేయనున్నారు. ఇందుకోసం 90 సెం.మీ. ల పైప్​ను తెప్పిం చారు. మంగళవారం ఈ పైప్​ను శిథిలాల మధ్యలో నుంచి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయ రహదారిపై టన్నెల్..

చార్ ధామ్​ ప్రాజెక్టులో భాగంగా ఉత్తరకాశీని యమునోత్రితో కలిపేందుకు జాతీయ రహదారి 24 పై సిల్క్యారా, దండల్గావ్​మధ్య ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్​ను రెండు వైపుల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. టన్నెల్ మధ్యలో మరో 441 మీటర్లు తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సిల్క్యారా వైపు టన్నెల్​మధ్యలో కూలిపోయింది. దాదాపు 60 మీటర్ల మేర మట్టి, రాళ్లతో టన్నెల్​ ను కప్పేసింది. ఓవైపు తవ్వకం జరుగుతుండగా మరోవైపు టన్నెల్ కూలిపోవడంతో దారి మూసుకుపోయింది.

నలభై మంది వర్కర్లు లోపలే ఉండిపోయారు. అయితే, మధ్యలో 400 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉండడంతో వర్కర్లు ప్రాణాలతో ఉన్నారని ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్పారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్వో, ఆర్ఏఎఫ్, హెల్త్​ డిపార్ట్ మెంట్​కు సంబంధించి మొత్తం 160 మంది సిబ్బంది రెస్క్యూ పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ స్టీల్​ పైపును లోపలికి పంపేందుకు ఓ నిపుణుడితో పాటు నీటిపారుదల శాఖకు చెందిన ఐదుగురు ఇంజనీర్లతో ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

కొడుకుతో మాట్లాడిన ఓ వర్కర్..

శిథిలాల లోపల చిక్కుకుపోయిన వర్కర్లలో ఒకరైన గబ్బర్ సింగ్​ నేగి మంగళవారం తన కుమారుడితో మాట్లాడారు. ఆక్సీజన్ పంపించే పైపు గుండా తన తండ్రితో కొద్ది క్షణాల పాటు మాట్లాడినట్లు నేగి కొడుకు తెలిపాడు. తనతో పాటు మిగతా వర్కర్లు అందరూ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడన్నాడు.