ఆకాశం నుంచి పడ్డ బెలూన్.. చూసేందుకు ఎగబడ్డ జనం..

ఆకాశం నుంచి పడ్డ బెలూన్.. చూసేందుకు ఎగబడ్డ జనం..

హైదరాబాద్లో ఇవాళ ఉదయం ఆకాశంలో వింత కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ కనిపించిన వస్తువును చాలా మంది ఆసక్తిగా చూశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని మొగిలిగుండ్ల గ్రామంలోని ఓ పొలంలో పడిపోయింది. బెలూన్ ఆకారంలో ఉన్న దాని చూట్టూ కెమెరాలు ఉన్నాయి. ఈ వింత వస్తువును చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అది రీసెర్చ్ బెలూన్ అయి ఉంటుందని భావిస్తున్నారు.

హైదరాబాదులోని టాటా ఇన్స్టిట్యూట్ వారు వాతావరణం లో వచ్చే మార్పులను తెలుసుకునేందుకు ఈ హీలియం బెలూన్ను ప్రయోగించినట్లు తెలుస్తుంది. సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణించి ఇది పడిపోయినట్లు తెలుస్తోంది. భూమి నుంచి 40 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి వాతావరణం గురించి సమాచారం సేకరిస్తుందని సమాచారం. 

హైదరాబాద్ వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి టీఐఎఫ్ఆర్ బెలూన్ ఫెసిలిటీని 1969లోనే ఏర్పాటు చేశారు. సాధారణంగా జనవరి నుంచి ఏప్రిల్, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇలాంటి సైంటిఫిక్ బెలూన్ లాంఛ్ చేస్తుంటారు. గాలి వేగం తక్కువగా ఉండడం, అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే దీన్ని ప్రయోగిస్తుంటారు. భూమి మీద నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ వాతావరణం మారుతుంటుంది. ఈ మార్పులను గుర్తించి అనాలసిస్ చేస్తుంటారు. 1959లోనే ఉస్మానియా యూనివర్సిటీ సైంటిస్టులు పాలీఇథిలీన్ బెలూన్ ప్రయోగం చేశారు. మరోవైపు ఇలాంటి బెలూన్స్ ప్రయోగించడానికి నెల రోజుల ముందే అధికారులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుంటారు. ఫలితంగా బెలూన్ ఉన్న ఎత్తులో విమానాలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు.