కోల్‪కత్తా దారుణంపై ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఆందోళన.. దేశవ్యాప్తంగా 3లక్షల మంది నిరసనలు

కోల్‪కత్తా దారుణంపై ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఆందోళన.. దేశవ్యాప్తంగా 3లక్షల మంది నిరసనలు

కోల్ కతా/ న్యూఢిల్లీ: పశ్చిమ్ బెంగాలో మెడికో మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. కోల్ కతాలో RG కర్ హాస్పిటల్ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.  మరోవైపు మెడికో మర్డర్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. RGకర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ప్రొపేసర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రిజైన్ చేశారు. 

అటు దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్  రెసిడెంట్  డాక్టర్స్  అసోసియేషన్  తెలిపింది. హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్లకు భద్రతకు కేంద్రం ప్రోటో కాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది. అటు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఫోర్దా స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కేరళలోనూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నిరసనలు తెలుపుతామని కేరళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

 ఆర్జీ కర్ రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లను 24 గంటల్లోగా నెరవేర్చి న్యాయం చేయాలని, లేకపోతే వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా ప్రతినిధులు ఆదివారం ఈమేరకు లేఖ రాశారు. 

డాక్టర్ హత్య కేసులో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోర్డా శనివారం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాసింది. అయితే, జరిగిన సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, డిమాండ్లను నెరవేర్చకపోతే ఊరుకోబోమని తాజాగా ఆదివారం నాటి లేఖలో తేల్చిచెప్పింది. 

ముగ్గురు భార్యలు వదిలేశారు..

నిందితుడు సంజయ్ కోల్ కతాలోని శంభునాథ్ పండిట్ కాలనీకి చెందిన వాడని, పోలీస్ శాఖలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో వాలంటీర్​గా చేరాడని తెలుస్తోంది. దీనిని అడ్డంపెట్టుకుని అతడు ఓ పోలీస్ ఆఫీసర్​కు పీఏనని, హోంగార్డునని, రకరకాలుగా చెప్పుకుంటూ చెలామణీ అయ్యాడు. ఇటీవల అతడిని ఆర్జీ కర్ హాస్పిటల్ చెక్ పోస్టు వద్ద వాలంటీర్​గా వేశారు. అప్పటి నుంచి తరచూ ఆస్పత్రిలోకి వస్తూ పోతూ ఉండేవాడని చెప్తున్నారు. అతడి ఫోన్​లో పోర్న్ వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు. దీంతో అతడు పోర్న్ కు బానిసై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని భావిస్తున్నారు. సంజయ్ నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడని.. రోజూ తాగా వచ్చి చిత్రహింసలు పెట్టడం వల్ల అతడిని ముగ్గురు భార్యలు వదిలేసి పోయారని స్థానికులు వెల్లడించారు. నాలుగో భార్య గత ఏడాది క్యాన్సర్​తో చనిపోయిందని తెలిపారు.

బెంగాల్​లో వైద్య సేవలపై ఎఫెక్ట్

మహిళా డాక్టర్ రేప్, హత్య నేపథ్యంలో బెంగాల్​లోని అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు, ఇతర స్టాఫ్ వరుసగా మూడో రోజు కూడా నిరసనలు చేపట్టారు. దీంతో ఆదివారం కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది.

డెడ్ బాడీపై తీవ్ర గాయాలు

ప్రాథమిక అటాప్సీ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి పై లైంగిక దాడి జరిపి హత్య చేసినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. ‘‘ఆమె కండ్లు, నోటి నుంచి రక్తంకారింది. ముఖంపై గాయాల య్యాయి. నడుము, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, వేలు, పెదాలు, మర్మాంగాలపైనా గాయా లు ఉన్నాయి ” అని పోలీసులు తెలిపారు. ‘‘సెమినార్ హాల్​లో బాధితురాలు నిద్రిస్తున్నప్పు డు ఈ దాడి జరిగింది” అని వివరించారు. 

నేరానికి పాల్పడిన తర్వాత నిందితుడు తాను ఉంటున్న ప్లేస్​కు వెళ్లి బట్టలు, బూట్లను శుభ్రం చేసుకున్నాడని, వాటిపై రక్తపు మరకలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఘటనా స్థలంలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని, అక్కడ అతడి బ్లూటూత్ హెడ్ సెట్ కూడా దొరికిందన్నారు.