విరాళాలియ్యలేదని ఏకంగా ఊరినే వెలేసిన్రు

విరాళాలియ్యలేదని ఏకంగా ఊరినే వెలేసిన్రు
  • 300 కుటుంబాలతో మాట్లాడడానికి వీల్లేదంటూ తీర్మానించిన మరో 11 గ్రామాలు
  •  గత నెల 15 నుంచి అమలవుతున్న నిర్ణయం
  •  ఆసిఫాబాద్​ జిల్లా దస్నాపూర్​కు రాకపోకలు బంద్​
  • పెండ్లిళ్లు, పేరంటాలన్నీ క్యాన్సిల్​

ఆసిఫాబాద్ , వెలుగు : విరాళాలు ఇవ్వనందుకు కుమ్రం భీమ్​ఆసిఫాబాద్ ​జిల్లాలో ఏకంగా ఓ గ్రామాన్నే వెలేశారు. దీంతో ఆ ఊరిలోని 300 కుటుంబాలకు చుట్టుపక్కలున్న 11 గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. అటు నుంచి ఎవరూ రావడం లేదు. ఇటు నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సంతాజీ జగన్నాడే మహరాజ్ జయంతి వేడుకలు జరిగాయి. దీనికి ఈ ప్రాంతంలోని 12 గ్రామాలకు చెందిన తేలి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హాజరయ్యారు. వేడుకలకు ఆసిఫాబాద్ మండలంలోని దస్నాపూర్ కులస్తులు అడిగినంత విరాళం ఇవ్వలేకపోయారు. గ్రామంలో ఉన్న 300 కుటుంబాల్లో చాలా మంది నిరుపేదలే ఉండడంతో అందరూ కలిసి రూ.60 వేలు ఇస్తామన్నారు. తాము ఇంటికి రూ.500 అడిగితే రూ.60 వేలు అంటారా అంటూ ఆగ్రహంతో మిగతా11 గ్రామాలకు చెందిన పెద్దలు డిసెంబర్​15న దస్నాపూర్ గ్రామాన్ని వెలి వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఊరిలో తేలి కులస్తులు ఏ కార్యక్రమం చేసినా వెళ్లకూడదని, సంబంధాలు పెట్టుకోవద్దని, ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో  25 రోజులుగా ఆ ఊరు ఏకాకిగా మిగిలింది. బంధువులు రాక పెండ్లిళ్లు, పేరంటాలు ఆగిపోయాయి. మిగతా 11 గ్రామాల్లో దగ్గరి వాళ్లు ఏ ఫంక్షన్లు నిర్వహించినా వెళ్లలేని పరిస్థితి. దీంతో దస్నాపూర్​వాసులు బహిష్కరణ ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఎదురుచూస్తున్నారు.