ఊపిరి ఆడ్తలేదు!..రైస్ మిల్లుల్లోని హమాలీ కార్మికుల్లో శ్వాస సమస్యలు

ఊపిరి ఆడ్తలేదు!..రైస్ మిల్లుల్లోని హమాలీ కార్మికుల్లో శ్వాస సమస్యలు
  • కొందరిలో వెన్ను, తలనొప్పి, చర్మవాధుల ఇబ్బందులు
  • సీఎంఆర్, మమత మెడికల్ సైన్సెస్ డాక్టర్ల స్టడీలో వెల్లడి 
  • కరీంనగర్ మండలంలో 273 మంది రైస్ మిల్లు వర్కర్లపై సర్వే

కరీంనగర్, వెలుగు: రైస్ మిల్లుల్లో పనిచేసే మెజార్టీ హమాలీ కార్మికులు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు.  మరి కొందరు వెన్నునొప్పి, తలనొప్పి, చర్మవాధులతో బాధపడుతున్నట్టు అపోలో హాస్పిటల్ డాక్టర్ స్టడీలో వెల్లడైంది. సీఎంఆర్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ కుమార్ సమతం, మమత మెడికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బల్లా కృష్ణ సౌమ్య, మెడికల్ ఇంటర్న్ నీరటి ధీరజ్ టీమ్  కరీంనగర్ మండలంలోని రైస్ మిల్లుల్లోని కార్మికులపై  కొన్నాళ్ల కింద సర్వే జరిపింది. ఇటీవల క్రాస్-సెక్షనల్ అబ్జర్వేషనల్ స్టడీ వివరాలతో కూడిన ఆర్టికల్ జర్నల్ ఆఫ్​పాపులేషన్ థెరపిటిక్స్ అండ్ క్లినికల్ ఫార్మాకాలజీ జర్నల్ లో పబ్లిష్ అయింది. 

పదేండ్లకు పైగా పని చేస్తున్నవారిలో

ఈ స్టడీలో భాగంగా వివిధ రైస్ మిల్లులకు చెందిన 273 మంది వర్కర్లను పరీక్షించారు. వీరిలో 200 మంది మగవాళ్లు ఉండగా.. ఇందులో ఎక్కువగా 122 మంది పదేండ్లకుపైగా రైస్ మిల్లుల్లో పని చేస్తున్నవారే ఉన్నారు. హమాలీలు 121 మంది కాగా.. హెల్పర్లు 51 మంది ఉన్నారు. రైస్ మిల్లుల్లోని ధాన్యపు దుమ్ము, ధూళీ వర్కర్ల కండ్లు, ముక్కు, చర్మం, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రత్యేకించి ధాన్యపు పొట్టులో ఎక్కువగా ఉండే సిలికాను పీల్చడంతో కార్మికుల్లో ఆస్బెస్టాసిస్, ఫైబ్రోసిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు కొన్నిసార్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం ఉంది. 

ఈ స్టడీలో రైస్ మిల్లు వర్కర్లలో 128 మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అలాగే రైస్ మిల్లుల్లో ధాన్యం, బియ్యం సంచులను మోయడం హమాలీల పని. వాటిని మోసేటప్పుడు శరీరాన్ని వంచడం, బరువులు మోయడంతో 125 మంది కండరాలు, ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 92 మంది దగ్గుతో.. 131 మంది కంటి అలర్జీతో,  17 మంది చర్మ వ్యాధుల బారినపడినట్లు గుర్తించారు. రైస్ మిల్లుల ధూళీ కేవలం కార్మికులకేగాక మిల్లుల చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా శ్వాస సంబంధ సమస్యలను కలిగిస్తుందని డాక్టర్ల టీమ్ తమ ఆర్టికల్ లో పేర్కొంది.