
జన్నారం, వెలుగు: ప్రజల ఆంకాక్ష మేరకే ప్రభుత్వం కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆంక్షలు ఎత్తివేసిన సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వైల్డ్ లైఫ్ బోర్టులో మెంబర్గా ఉన్న తాను ప్రతి మీటింగ్లో టైగర్ జోన్ పరిధిలో ఉన్న జన్నారం, కడెం, ఖానాపూర్ మండలాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు.
దీంతో ఆంక్షలు ఎత్తివేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న రాజకీయ నేతలు ఆంక్షలపై గత సర్కారు మీద ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. కేవలం తమ పబ్బం గడుపుకోవడానికి టైగర్ జోన్ అంశాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. జన్నారం మండలాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, జనరల్ సెక్రటరీ మాణిక్యం, నాయకులు ఇసాక్, రమేశ్, ముత్యం సతీశ్, రాజన్న, నందునాయక్ , సోహెల్ షా తదితరులు పాల్గొన్నారు.