
- దేశవ్యాప్తంగా 13,16,268 మంది క్వాలిఫై
- రాష్ట్రంలో 47,371 మంది ఉత్తీర్ణత
- ఈ సారి ఉమ్మడిగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్
- టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక్కరే
- ఎస్టీ కేటగిరీలో టాప్ 2 ర్యాంకులను
- దక్కించుకున్న రాష్ట్ర స్టూడెంట్స్
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 23,33,297 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 13,16,268 మంది అర్హత సాధించారు. ఇందులో అమ్మాయిలు 7,69,222 మంది ఉండగా, అబ్బాయిలు 5,47,036 మంది ఉన్నారు. 10 మంది ట్రాన్స్‌జెండర్లు క్వాలిఫై అయ్యారు. ఈ సారి ఉమ్మడిగా 67 మందిని నేషనల్ ఫస్ట్ ర్యాంకర్స్‌గా ఎన్టీఏ ప్రకటించింది. వీళ్లందరూ 99.997129 పర్సంటైల్ సాధించినట్టు వెల్లడించింది. ఈ 67 మందిలో వివిధ కొలమానాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన వేద్ సునీల్‌కుమార్ షిండేను లిస్టులో మొదటి స్థానంలో చూపించింది. కానీ, అందరికీ ఫస్ట్ ర్యాంక్‌ను కేటాయించింది.
టాప్ ర్యాంకులు లేవు
తెలంగాణ నుంచి ఈ ఏడాది 77,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,371 (60.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నిరుడి కంటే 2.29 శాతం అధికంగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. కానీ, టాప్ 50 లిస్టులో మన రాష్ట్రం నుంచి ఒక్క స్టూడెంట్ కూడా లేరు. రాష్ట్రం నుంచి 99.996614 పర్సంటైల్‌తో అనురన్ ఘోష్ అనే స్టూడెంట్ జాతీయ స్థాయిలో 77వ ర్యాంకు సాధించాడు. టాప్ 100లో ఒక్కడే నిలిచాడు. ఇక జాతీయస్థాయిలో ఎస్టీ కమ్యూనిటీ నుంచి టాపర్లుగా నిలిచిన ఇద్దరు స్టూడెంట్లు తెలంగాణవాళ్లే కావడం గమనార్హం. ఈ లిస్టులో గుగులోతు వెంకట నృపేశ్(నేషనల్ ర్యాంక్ 167) తొలి స్థానంలో, లావుడ్య శ్రీరామ్ నాయక్ (నేషనల్ ర్యాంక్ 453) రెండో స్థానంలో నిలిచారు.