SIR పై వివాదాలు.. మరో శేషన్ రావాలేమో!

SIR పై వివాదాలు.. మరో శేషన్ రావాలేమో!

ప్రజాస్వామ్య  వ్యవస్థలో తమ పాలకులను ఎంచుకోవడానికి అర్హతగల పౌరులందరూ పాల్గొనే అతి ముఖ్యమైన ప్రక్రియ ఎన్నికలు.  ప్రజాస్వామ్యంలో  ప్రతి ఓటు విలువైనదే.  కాబట్టి,  పటిష్టమైన  ఎన్నికల  నిర్వహణ ద్వారానే విజయవంతమైన  ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన పునాది ఏర్పడుతుంది.  ప్రపంచంలోనే  అతిపెద్ద  ప్రజాస్వామ్యాన్ని కాపాడే గురుతర బాధ్యత నిర్వహించే క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు  భారత రాజ్యాంగం ఎన్నో అధికారాలను ఇచ్చింది.  కానీ, 1990 డిసెంబరు 12న  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌ (సీఈసీ)గా  టి.ఎన్.శేషన్  బాధ్యత చేపట్టక ముందున్నవారిలో చాలామంది అధికార పార్టీకి అనుగుణంగా నడుచుకోవడమో లేదంటే నిష్క్రియాపరంగా ఉండటమో తప్ప స్వతంత్ర ప్రతిపత్తి చూపిన సందర్భాలు లేవు.  గత  రెండు దశాబ్దాలుగా  ఓటరు జాబితాలలో అవకతవకలు, ఎన్నికల  నిర్వహణలో పారదర్శకతాలోపం, నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ద్వంద్వ వైఖరి,  ఈవీఎం వివాదాలు, పోలింగ్ శాతం ప్రకటనలో అసాధారణ జాప్యం తదితర కారణాల వలన ఈసీఐ సమగ్రత  ప్రశ్నార్థకమైంది. ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం. 


ప్రజాభిప్రాయం అనుసరించి ప్రభుత్వం ఏర్పడాలంటే ముందు ఓటరు జాబితా సక్రమంగా తయారవ్వాలి.  ఓటుహక్కు అమూల్యమైనదిగా పేర్కొంటూ సంబంధిత వ్యక్తుల వాదన వినకుండా ఎవరి పేర్లనూ ఓటరు జాబితా నుంచి తొలగించకూడదని  గతంలోనే  కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.  బిహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కొన్ని నెలల ముందు ఆకస్మికంగా విదేశీ అక్రమ వలసదారుల ఏరివేత  సాకుతో,  ఓటర్ల జాబితా  ‘ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)’ పేరుతో ఈసీ సవరణ చేపట్టింది.  బిహార్​కు చెందిన ఎనిమిది కోట్ల మంది ఓటర్లు తిరిగి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీఐ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంవత్సరంలో ఇటువంటి ప్రత్యేక సమగ్ర సవరణలు అనుమతించకూడదన్న తన స్వీయ నియమాన్ని ఈసీఐ తానే ఉల్లంఘించింది.  తమను తాము అర్హులైన ఓటర్లుగా నిరూపించుకునే బాధ్యతను ప్రజలపై ఉంచే ఈ కసరత్తు 65 లక్షల మంది ‘సామూహిక ఓటుహక్కు తొలగింపునకు’ దారితీసింది. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(సి), సెక్షన్ 4(1)(డి)లను  ధిక్కరించే విధంగా సుప్రీంకోర్టులో బాధ్యతారహితంగా ఈసీ వాదనలు వినిపించింది.  ఐదు కోట్ల మంది ఓటర్లు పౌరులా కాదా  నిర్ణయించాల్సింది ఈసీ కాదని చెబుతూ పౌరుల ప్రాథమిక హక్కులకు పట్టం కట్టేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన విశిష్టమైన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదింది.

‘ఓటు చోరీ’  ఆరోపణలు

2019  సార్వత్రిక  ఎన్నికలలో  పోలింగ్ ప్రక్రియ ముగిసిన 48 గంటలలోపే తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది.  కానీ,  గత  సార్వత్రిక ఎన్నికలలో తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో అసాధారణ జాప్యం (మొదటి దశ 11రోజులు, రెండోదశ 4 రోజులు),  ప్రాథమిక- తుది పోలింగ్ అంచనాల మధ్య 5-6 శాతం (సుమారు 5.4 కోట్ల ఓట్లు) పెరుగుదల  ఎన్నికల  సమగ్రతపై  ప్రశ్నలను లేవనెత్తింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కూడా ఓటరు జాబితాలలో  గణనీయమైన  చేర్పులు, ఓటింగ్ శాతంలో వరుసగా సుమారు 8శాతం, 7.2శాతం ఆకస్మిక పెరుగుదల కనిపించింది. ఎక్కడైతే ఓట్లు పెరిగాయో అక్కడ అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ కూటమికి లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 

నియామకంలో ప్రభుత్వ పాత్ర తగ్గాలి

‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు ఈసీఐ నిబద్ధత మీద ప్రస్తుతం అనుమానాలు వెలిబుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో విమర్శించిన బీజేపీ రెండూ ప్రస్తుత పరిస్థితికి సమబాధ్యులు.  టీఎన్. శేషన్  సీఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  అప్పటివరకు ఉన్న అస్తవ్యస్త  పరిస్థితులను చక్కదిద్ది, ఎన్నికల నిర్వహణ వ్యవస్థను గాడిలో పెట్టడంతో ప్రజాదరణ పొందారు.  ఎన్నికల  నిబంధనావళి కచ్చితంగా అమలుచేసి, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా,  న్యాయంగా జరిగేలా  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శేషన్‌‌‌‌  తీసుకొచ్చిన  సంస్కరణల కారణంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపించిన దాదాపు 1500 మంది అభ్యర్థులపై  మూడేళ్లపాటు వేటు పడింది. నాడు శేషన్ సంస్కరణల వేగానికి ముకుతాడు వేయడానికి, ఈసీఐపై ప్రభుత్వ ఆధిపత్యం కోసం పీవీ 1993లో  రాష్ట్రపతిచేత ఇద్దరు అదనపు ఎన్నికల కమిషనర్లను నియమింపజేశారు.

ప్రతిపక్ష నేత పాత్ర నామమాత్రమే

పారదర్శకత,  నిష్పాక్షికత కోసం ప్రధానమంత్రి,  ప్రధాన ప్రతిపక్ష నాయకుడు,  భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫారసు మేరకు.. రాష్ట్రపతి ఎన్నికల సంఘం సభ్యులను నియమించాలని జూన్, 2023లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పును  నిర్వీర్యం చేసి తిరిగి ఎన్నికల సంఘంపై  ప్రభుత్వ పెత్తనం కొనసాగించడం కోసం సీజేఐ స్థానంలో  కేంద్ర మంత్రివర్గంలోని  ఒక సభ్యుడు ఉండేవిధంగా భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. 

2023లో  సవరించిన చట్టం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేసే కమిటీలో  మెజారిటీ అధికార పార్టీదే ఉన్నందువల్ల ప్రతిపక్ష నాయకుని పాత్ర నామమాత్రమే. దక్షిణాఫ్రికాలోలాగ కమిషనర్ల నియామకం జరగాలి.  ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి రాజ్యాంగ రక్షణ ఉన్నా, మిగతా ఇద్దరు కమిషనర్లను కేవలం ప్రభుత్వ సిఫారసుతోనే తొలగించవచ్చు. దీనివలన ఎన్నికల సంఘం ప్రభుత్వ ఒత్తిడులకు లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి  పరిస్థితిని అధిగమించాలంటే మిగతా ఇద్దరు కమిషనర్లకు కూడా  ఈ తరహా రాజ్యాంగ రక్షణ కల్పించాలి లేదా సీఈసీకి అంతిమ నిర్ణయాధికారం ఇవ్వాలి.  దక్షిణాఫ్రికా విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పౌరసమాజ ప్రముఖునితో  కూడిన కమిటీ ఎంపికచేసిన ఎన్నికల సంఘం సభ్యుల నియామకాన్ని పార్లమెంటులో చర్చించి ఆమోదించే విధానాన్ని స్వీకరిస్తే  ఈసీఐ  స్వతంత్ర ప్రతిపత్తికి బలం చేకూరుతుంది. 

మరో శేషన్​ రావాలె!

ప్రస్తుతం ఈసీ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు  భారత  ప్రజాస్వామ్యాన్ని పలుచన చేస్తున్నాయి.  ‘శేషన్ లాంటివారు ఎప్పుడో ఒకసారిగాని కనిపించరు.  శేషన్ లాంటి వ్యక్తిత్వం కలవారు ఎన్నికల కమిషనర్​గా రావాలి.  ప్రధాన మంత్రి తప్పుడు నిర్ణయంపై చర్య  తీసుకోగల  ప్రధాన  ఎన్నికల  కమిషనర్  కావాలి అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య  ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. రాజకీయ పార్టీలు లేవనెత్తే అభ్యంతరాలను సంయమనంతో పరిష్కరిస్తూ, రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిబద్ధతతో ఎన్నికల నిర్వహణకు ఉపయోగించి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఎన్నికల సంఘాన్ని నడిపించే మరో  శేషన్ రావాలంటే ఎన్నికల సంఘం సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలి. 

అసమంజస వివరణలు

రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓటు చోరీ’ ఆరోపణలపై  దర్యాప్తు జరిపి  నిజానిజాలను  ప్రజల ముందు పెట్టకుండా మీడియా ద్వారా ఎదురుదాడి చేయడం ఈసీ గౌరవానికి తగనిది.  ఇంకోవైపు మహారాష్ట్రలో  మహిళా ఓటర్ల  గోప్యతను రక్షించడానికి పోలింగ్ బూత్ ల  సీసీటీవీ  ఫుటేజ్  ఇవ్వడం సాధ్యం కాదని,  ఓటర్ లిస్టులో డేటాను మార్చకుండా నిరోధించడానికి మెషిన్ రీడబుల్ ఓటర్ల జాబితా ఇవ్వలేదని సీఈసీ జ్ఞానేశ్​ కుమార్ ఇచ్చిన అసమంజసమైన వివరణ ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తించేవిధంగా ఉంది.  2019 ఎన్నికలలో ఈసీ నిజాయితీ  ప్రశ్నార్థకం కాగా 2024లో  విశ్వసనీయత కోల్పోయిందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.

లింగమనేని శివరామ ప్రసాద్

సోషల్ ఎనలిస్ట్