ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ..రిటైర్డ్ ఎస్ఐ కొడుకు అనుమానస్పద మృతి

ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ..రిటైర్డ్ ఎస్ఐ కొడుకు అనుమానస్పద మృతి

మేడ్చల్ జిల్లా: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన రిటైర్డ్‌ ఎస్‌ఐ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఏదులాబాద్‌ ఫామ్‌హౌస్‌లో చోటుచేసుకుంది. యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉప్పల్‌ భగాయత్‌కు చెందిన రిటైర్డ్‌ ఎస్‌ఐ సి. ప్రవీణ్‌ కుమార్‌ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) బీటెక్‌ పూర్తి చేశాడు. తన స్నేహితుడు ఘన్‌కోట్‌ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు. అయితే, అక్కడ కృష్ణ కౌండిన్య అనుమానాస్పద పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో పడిపోయాడు.

కృష్ణ కౌండిన్య అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని అతడి స్నేహితుడు రిషబ్‌ తండ్రి ప్రవీణ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి తెలియజేశాడు. అనంతరం యువకుడిని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే కృష్ణ కౌండిన్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ALSO READ : వాటర్ హీటర్‌తో జాగ్రత్త..

తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి ప్రవీణ్‌ కుమార్‌ ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.