నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ

నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ
  • కరీంనగర్ లో 17,88,218 మంది  ఓటర్లు 
  • పెద్దపల్లిలో 15,92,996 మంది ఓటర్లు 

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలుకానుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న  నామినేషన్ల పరిశీలన, 29న   ఉపసంహరణ ఉంటుంది. 19న తొలిరోజు మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెట్లు కూడా   నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లలో నామినేషన్లు స్వీకరిస్తామని ఆయా లోక్ సభ స్థానాల రిటర్నింగ్ ఆఫీసర్లు పమేలా సత్పతి, ముజామిల్ ఖాన్ వెల్లడించారు. 

ఐదేళ్లలో లక్షకు పైగా పెరిగిన ఓటర్లు.. 

కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో గడిచిన ఐదేళ్లలో లక్షకుపైగా ఓటర్లు పెరిగారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో 2019లో 16,51,543 ఓటర్లు నమోదై ఉండగా, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 17,88,218కి చేరింది. ఇందులో పురుషులు 8,73,819 మంది ఉండగా, మహిళలు 9,14,306 మంది, ట్రాన్స్ జండర్లు 102 మంది ఉన్నారు. కరీంనగర్ లోక్ సభ  స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,36,675 ఓట్లు పెరిగాయి.  

 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,55,054 ఓట్లు నమోదై ఉండగా, మూడు నెలల్లోనే 3,62,440కి చేరడం విశేషం. అలాగే పెద్దపల్లి లోక్ సభ పరిధిలో 2019లో మొత్తం ఓటర్లు 14,79,091 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య  15,92,996 కు చేరింది. ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,13,905 ఓటర్లు పెరిగారు.