
జగిత్యాల, వెలుగు: మహిళా ఉద్యోగిని వేధించిన ఘటనలో జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నెల 10న విధి నిర్వహణలో కలిసి పని చేసిన ఓ మహిళా ఉద్యోగితో తహసీల్దార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
వాట్సాప్ లో అసభ్యకరంగా మెసేజ్ లు పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి వేధించాడు. వేధింపులపై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, సీఐ కరుణకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శుక్రవారం తహసీల్దార్ రవీందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.