రైతుబంధు డబ్బులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నరు .. రాష్ట్ర సర్కార్‌‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు 

రైతుబంధు డబ్బులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నరు .. రాష్ట్ర సర్కార్‌‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు 
  • కోడ్‌ ఉన్న టైమ్‌లో ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నరు
  • ప్రభుత్వ, అసైన్డ్​ భూములను ధరణిలో మారుస్తున్నరు
  • ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టండి
  • నాలుగు అంశాలపై సీఈఓను కలిసిన రేవంత్, ఉత్తమ్, మధుయాష్కీ, నిరంజన్

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేస్తున్నదని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. శనివారం బీఆర్కే భవన్​లో సీఈఓ వికాస్ రాజ్‌ను పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, నిరంజన్ రెడ్డి తదితరులు కలిశారు. నాలుగు అంశాల విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కంప్లైంట్ చేశారు. తర్వాత మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధుకు సంబంధించిన రూ.6 వేల కోట్లను నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వరుస క్రమంలో కాకుండా వారికి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదన్నారు. 

‘‘భూ రికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌ జిల్లాల్లోని ప్రభుత్వ, అసైన్డ్​ భూముల్ని ధరణి పోర్టల్‌‌‌‌లో మారుస్తున్నారు. ఈ విషయాలన్నీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాం. అసైన్డ్‌‌‌‌ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరాం. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌‌‌‌ నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశాం. ఎన్నికల ఫలితాల తర్వాత సోమవారం కేబినెట్ భేటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరాం” అని వివరించారు. ‘‘ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరాం’’ అని ఉత్తమ్ అన్నారు. సీఎం కేసీఆర్ సోమవారం కేబినెట్ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని, రాజీనామాలు సమర్పించేందుకే ఏర్పాటు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.