- రాష్ట్రంలో వేల కోట్ల భూ కబ్జాలకు కేసీఆర్ ముఠా కుట్ర
- సహకరించిన ‘నమస్తే’ దామోదర్‌రావుకు లంచంగా బెంజ్ కారు
- వాళ్ల ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులొస్తున్నయ్
- తాజాగా సుప్రీంలో మియాపూర్ భూములను గెలుచుకున్నం
- చారిత్రక తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు
- కేసీఆర్, కేటీఆర్ బుద్ధి మార్చుకుని భూకబ్జాలు మానుకోవాలె
- మియాపూర్ భూములపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠినంగా అణిచివేస్తం
- ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో కేసీఆర్, కేటీఆర్ చెర నుంచి రూ.లక్షన్నర కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ కుటుంబం, వారి అనుచరుల ముఠా కబంధ హస్తాల్లో ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను రక్షించామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రగతి భవన్ కేంద్రంగా చేసిన భూ ఆక్రమణలను ఆయన బయటపెట్టారు.
కేసీఆర్ ముఠా, ఆయన కుటుంబం ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని భూ కబ్జాలు మానుకోవాలని హెచ్చరించారు. కోర్టు తీర్పులతో కాపాడిన ఈ విలువైన భూములను అమ్మి, వచ్చిన నిధులను నీటిపారుదల, పేద విద్యార్థుల చదువు, వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు వాడుతామని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్.రఘురాం రెడ్డి, సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్
పాల్గొన్నారు.
మియాపూర్‌లో రూ.50 వేల కోట్ల విలువైన 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమని రేవంత్ అన్నారు. ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు నాటి సీఎం కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారని ఆరోపించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్, ట్రినిటీ ఇన్ఫ్రా తదితరులు తప్పుడు రికార్డులు సృష్టించి భూమిని కాజేయాలని చూశారన్నారు. ‘ఈ రిజిస్ట్రేషన్లు బోగస్ అని సుప్రీంకోర్టు తీర్పులోని 44, 51, 58 పేరాల్లో స్పష్టంగా పేర్కొంది. గత ప్రభుత్వం అసలు సూత్రధారులను వదిలేసి, కింది స్థాయి అధికారులైన తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంది’ అని చెప్పారు. మియాపూర్‌లోని 550 ఎకరాలను సర్వే చేయాలని ఆదేశించామని, సర్వే పూర్తయి సరిహద్దులు తేలితేనే అందులో అక్రమ నిర్మాణాలు వచ్చాయా అనేది తెలుస్తుందని అన్నారు.
రికార్డులు మార్చి కొల్లగొట్టే కుట్ర
రికార్డులు మార్చి రూ.50 వేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దామోదర్ రావు కలిసి గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను అడ్డుపెట్టుకుని కుట్ర చేశారని సీఎం ఆరోపించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడికి చెందిన ‘ట్రినిటీ ఇన్ఫ్రా’ పేరు మీద ఉన్న ఖరీదైన బెంజ్ కారు దామోదర్ రావుకు నజరానాగా అందిందని, ఆ తర్వాత కేసీఆర్‌కు కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. ‘ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఈ కబ్జాలపై పోరాడినందుకే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు. అయినా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఏకమై ప్రజల ఆస్తులను కాపాడేందుకు పోరాడారు’ అని అన్నారు.
ధరణి ముసుగులో భూ కబ్జాలు
ధరణి ముసుగులో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, తమ అనుయాయులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్ ముఠా భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిందని సీఎం ఆరోపించారు. గతంలో ఐఎంజీ భరత సంస్థకు కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు కలిపి 850 ఎకరాలు కేటాయిస్తే, నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ కేటాయింపును రద్దు చేశారని గుర్తుచేశారు. కానీ ధనదాహంతో బీఆర్ఎస్ సర్కార్ కోర్టులో ఆ సంస్థకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు.
ఏడు చోట్ల కాపాడాం
రాష్ట్రంలో ఏడు చోట్ల విలువైన భూములను అమ్ముకుని ధనదాహం తీర్చుకునేందుకు కేసీఆర్ ముఠా ప్రయత్నించిందని, వాటి విలువ రూ.1.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని రేవంత్ చెప్పారు. కోర్టుల్లో పోరాడి మూడేండ్లలో ఈ భూములన్నింటినీ కాపాడామన్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే దామోదర్ రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ లాంటి వాళ్లను ముందుపెట్టి కేసీఆర్ ముఠా మళ్లీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే ఇందులో అటవీ భూములను ఆ శాఖకు అప్పగించి, మిగిలిన భూముల ద్వారా వచ్చే నిధులను పేదల అభివృద్ధికి వాడతామని చెప్పారు. ‘కేసీఆర్.. ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోమని నీ ముఠాకు చెప్పు. ఈ అక్రమాలకు స్వస్తి చెప్పండి. మియాపూర్ భూములపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలని చూస్తే ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుంది’ అని హెచ్చరించారు.
ఇందిరా గాంధీ సంక్షేమ విధానాలు మార్గదర్శకం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ‘దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా తన ప్రాణాలనే పణంగా పెట్టి పని చేశారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇందిరాగాంధీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారని’ కొనియాడారు. ఇందిరాగాంధీ చూపిన సంక్షేమ పాలన, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి మార్గంలోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
కాపాడిన భూములు ఇవే
మియాపూర్ (రంగారెడ్డి): సర్వే నంబర్లు 100, 101లోని 550 ఎకరాల సర్కారు పోరంబోకు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారుల కుట్ర. ప్రభుత్వ భూమేనని సుప్రీంకోర్టు తీర్పు.
కంచ గచ్చిబౌలి, మామిడిపల్లి: ఐఎంజీ భరత సంస్థకు 850 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం. కోర్టుల్లో పోరాడడంతో భూములు ప్రభుత్వపరం.
మంచిరేవుల (గండిపేట మండలం): సర్వే నంబర్ 393లోని 143 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నం. కోర్టుల ద్వారా తిరిగి సాధించిన ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్‌ను ఆనుకుని, గ్రేహౌండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ భూమిలో 50 ఎకరాలు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు కేటాయింపు.
సాహెబ్‌నగర్ కలాన్ (హయత్‌నగర్ మండలం): సర్వే నంబర్ 201లోని 140 ఎకరాల అటవీ భూమి పరిరక్షణ.
భద్రాద్రి కొత్తగూడెం: 600 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసే ప్రయత్నం. న్యాయ పోరాటంతో ప్రభుత్వపరం.
జయశంకర్ భూపాలపల్లి: రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని ఓ రాజకీయ నాయకుడికి నజరానాగా అప్పగిస్తే, సుప్రీంకోర్టులో పోరాడి సాధించిన ప్రభుత్వం.
కొండాపూర్ (శేరిలింగంపల్లి మండలం): సర్వే నంబర్ 59లోని రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాలను నాటి ప్రభుత్వ అండతో ఆక్రమించే యత్నం. గతేడాది హైకోర్టులో కేసు గెలిచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.
కాపాడిన భూముల లెక్కప్రాంతం విస్తీర్ణం (ఎకరాల్లో)
మియాపూర్ 550
భద్రాద్రి కొత్తగూడెం 600
మామిడిపల్లి 450
కంచ గచ్చిబౌలి 400
మంచిరేవుల 143
సాహెబ్‌నగర్ కలాన్ 140
భూపాలపల్లి 106
కొండాపూర్ 36
మొత్తం 2,425
