చేవేళ్ల సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

చేవేళ్ల సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కేసీఆర్ మాత్రం భూముల కబ్జాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల సీఎం కేసీఆర్ 10 వేల ఎకరాల వరకు సంపాదించారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్.. లక్ష వైన్స్ టెండర్లు మాత్రం సాధించారని అన్నారు. తెలంగాణలో ముదిరాజులకు తీవ్ర నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఎంఐఎం పార్టీతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి..ఈసారి బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వంద రోజులు ప్రజల్లోనే ఉంటూ.. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. 

రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారని.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పునరుద్ధరించి.. వాళ్ల నిధులు వారికే.. వాళ్ల ఉద్యోగాలు వారికే కేటాయించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో కారు గుర్తు కనిపించకూడదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఒకప్పుడు పాయింటు, షర్టు లేనోడు ఇవాళ కోకాపేటలో రూ.100 కోట్లు పెట్టి ఎకరా పొలం కొంటున్నాడని, అది కూడా కేసీఆర్ హయాంలోనే అని చెప్పారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వందల కోట్లతో భూములు కొంటున్నారని, అవి ఎవరి డబ్బులని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాబందులను తిన్న రాక్షసుల మాదిరిగా తాయారయ్యారని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపదను కొల్లగొట్టారని, ఇవాళ మధ్యతరగతి వాళ్లు 100 గజాలు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో పేదల భూములు లాక్కుని.. ఐటీ కంపెనీలకు అంటగడుతున్నారని ఆరోపించారు. 

రంగారెడ్డి జిల్లా నుంచి లక్ష కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తోందని, ఇక్కడి పేదల భూములకు 10 లక్షలు ఎకరాకు కట్టిస్తున్నారని చెప్పారు. అవే భూములను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆగస్టు 26వ తేదీన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే హాజరవుతారని తెలిపారు.