కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టాలె : రేవంత్ రెడ్డి

కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టాలె : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీబీఐ, ఈడీకి సైతం ఫిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు.

కేసీఆర్ పరిపాలనను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలోకి చేర్చుకున్నడని విమర్శించారు. అ 2018లో బీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. కేసీఆర్ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని తమవైపు తిప్పుకొని విలీనం చేసుకుంటే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకర్ ఓకే చెప్పారని అన్నారు. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సబితకు మంత్రి పదవి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందారని రేవంత్ ఆరోపించారు.