కేసీఆర్​పై దేశద్రోహం కేసు పెట్టాలె

కేసీఆర్​పై దేశద్రోహం కేసు పెట్టాలె
  • అరెస్టు చేసి శిక్షించాలి.. గజ్వేల్​ పీఎస్​లో రేవంత్​రెడ్డి ఫిర్యాదు
  • పోలీసులు పట్టించుకోకపోతే కోర్టులను ఆశ్రయిస్తం
  • రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం క్షమాపణ 
  • చెప్పాల్సిందేనని పీసీసీ చీఫ్​ డిమాండ్​ 

గజ్వేల్, వెలుగు: రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా సీఎం కేసీఆర్ కామెంట్లు చేసినందున ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్​ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్ల ప్రయోజనం లేదంటూ కేసీఆర్ మట్లాడిన మాటలు  దేశద్రోహ చర్యేనన్నారు. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని సీఎం మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​పై వెంటనే దేశ ద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్  చేయాలి. ఆయన కామెంట్లను ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు ప్రసారం చేసిన టీ న్యూస్ యాజమాన్యాలపై కూడా రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినం. కేసీఆర్ తో పాటు ఆ మీడియా సంస్థలపై పోలీసులు బాధ్యత ప్రకారం కఠిన చర్యలు తీసుకోకపోతే కోర్టులను ఆశ్రయిస్తం” అని స్పష్టం చేశారు. రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్  వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు  చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ‘‘కేసీఆర్​పై కేసు నమోదు చేసి శిక్షించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆయన తన వద్ద ఉన్న బంట్రోతులతో వితండవాదం చేయిస్తే సరిపోదు” అని రేవంత్​ అన్నారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్​ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్​ వెంట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నేతలు శ్రవణ్​​కుమార్ రెడ్డి తదతరులు ఉన్నారు. అనంతరం.. వసంత పంచమి సందర్భంగా వర్గల్ సరస్వతి క్షేత్రంలో రేవంత్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.