కేటీఆర్​పై రేవంత్​ ఫైర్

కేటీఆర్​పై రేవంత్​ ఫైర్
  • పన్నులు కట్టించుకుని పక్క రాష్ట్రపోళ్లు అంటే పళ్లు రాలగొడ్తరు
  • మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తం
  • బీసీలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తామని హామీ

హైదరాబాద్, వెలుగు : చంద్రబాబు అరెస్టు విషయంలో మంత్రి కేటీఆర్​ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో రేవంత్ చిట్​చాట్​చేశారు. ‘‘కేటీఆర్​కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి. వారు కట్టే పన్నులు కావాలి. కానీ వాళ్లు నిరసన చేస్తామంటే మాత్రం వద్దంటున్నారు. వాళ్లు పక్క రాష్ట్రపోళ్లు అని మాట్లాడుతున్నారు. ఐటీ ఉద్యోగులు నిరసన తెలుపుతామంటే ఒప్పుకోకపోవడానికి హైదరాబాద్ ఏమైనా కేటీఆర్​జాగీరా? వీళ్లు వెళ్లి ఢిల్లీ జంతర్​మంతర్​వద్ద నిరసన చేయలేదా?

తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడి వారు అమెరికాలో నిరసన తెలపలేదా?” అని ప్రశ్నించారు. నిరసన తెలుపుతామంటే వినతిపత్రం తీసుకుని అనుమతివ్వాలి తప్ప.. తిరస్కరించడం సరికాదన్నారు. పన్నులు కట్టించుకుని తమ రాష్ట్రం కాదంటే ప్రజలే మూతిపళ్లు రాలగొడ్తారని అన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడని, ఆయన అరెస్టు కూడా జాతీయ స్థాయి అంశమని పేర్కొన్నారు.

ఆయనంత అనుభవం ఉన్న నేతలను చేతి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చన్నారు. ‘‘ఇప్పుడు చంద్రబాబు విషయంలో నిరసన వద్దంటున్నారు. రేపు మనల్ని కూడా నిరసన తెలపొద్దని అంటారు. వాళ్లను పక్క రాష్ట్రపోళ్లు అని విమర్శిస్తున్నారు. మరి చింతమడక వ్యక్తికి హైదరాబాద్​లో ఏం పని?” అని ప్రశ్నించారు.  

ఇయ్యాల కాంగ్రెస్ లోకి మైనంపల్లి..   

మైనంపల్లి హన్మంతరావు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరుతారని రేవంత్ తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద ఆయన కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు హైకమాండ్​ఒప్పుకుందని చెప్పారు. ‘‘ఒకేసారి అభ్యర్థుల జాబితా విడుదల చేయట్లేదు. విడతల వారీగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. స్క్రీనింగ్​కమిటీ నివేదికను సిద్ధం చేశాం. ఆ నివేదికను సెంట్రల్ ఎలక్షన్​కమిటీకి ఇస్తాం. కమిటీ ఆమోదం తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తాం. బీసీలకు మెజారిటీ సీట్లను కేటాయిస్తాం. సామాజిక న్యాయం అమలు చేయాలన్నదే మా ఉద్దేశం.

బీఆర్ఎస్​ఇచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లను బీసీలకు కేటాయిస్తాం” అని వెల్లడించారు. కాంగ్రెస్​లో బీసీలు పీసీసీ చీఫ్​లు అయ్యారని, బీఆర్ఎస్​లో కనీసం వర్కింగ్​ ప్రెసిడెంట్​అయ్యారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​కు వచ్చే ఎన్నికల్లో 25కు మించి సీట్లు రావన్నారు. బీజేపీ, ఎంఐఎం సింగిల్​డిజిట్​కే పరిమితమవుతాయన్నారు. షర్మిల డెడ్​లైన్​ విషయం తనకు తెలియదని చెప్పారు. 

కేసీఆర్​కు జ్వరం పట్టుకుంది

కాంగ్రెస్​నిర్వహించిన తుక్కుగూడ సభతో సీఎం కేసీఆర్​కు చలిజ్వరం వచ్చిందని రేవంత్​అన్నారు. ‘‘రాహుల్ గాంధీ చెప్పినవన్నీ నిజాలే. కేటీఆర్ మాదిరిగా బ్లఫ్​మాటలు మాట్లాడరు. కేటీఆర్​కు బుర్ర తక్కువ.. ఆకలి ఎక్కువ’’ అని విమర్శించారు. గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయాలన్న విషయంలో ప్రభుత్వానికి కామన్​ సెన్స్​ లేదని మండిపడ్డారు.