కేసీఆర్​కు నిరుద్యోగుల ఉసురు తగుల్తది : రేవంత్ రెడ్డి

కేసీఆర్​కు నిరుద్యోగుల ఉసురు తగుల్తది : రేవంత్ రెడ్డి
  • ప్రవళిక కుటుంబాన్ని అవమానిస్తున్నరు: రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలి
  • మోసపూరిత హామీలిచ్చి కేసీఆర్ మోసం చేశారని ఫైర్
  • మేం అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్ రెడ్డి

వికారాబాద్, వెలుగు :  కేసీఆర్​ ప్రభుత్వానికి నిరుద్యో గుల ఉసురు తగుల్తది అని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్లు రద్దు కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని మరోలా చిత్రీకరించి ఆ కుటుంబాన్ని అవమానించారని మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్​లో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ముందు నిన్నేపల్లిలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు పంచుతూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, చేతి గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ స్కీమ్​లను బీఆర్ఎసే కాపీ కొట్టిందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో విషయంలో బీఆర్​ఎస్​ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. భారీగా కార్యకర్తలు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీకి ఉన్న ఆదరణ చూ స్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం అనిపిస్తున్నదన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. తానే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు మూడు ఎకరాల భూమి చెప్పి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు.

100 రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తాం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండల్ రెడ్డి, జేదుపల్లి హనుమంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి తో పాటు పలువురికి కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఐదేండ్ల పాటు సేవ చేయింకోవాలని కార్యకర్తలకు సూచించారు.