
- మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్
- ఇయ్యాల సోనియా, రాహుల్, ఖర్గేతో భేటీ
- కేబినెట్ కూర్పు, పోర్ట్‌ఫోలియోల కేటాయింపుపై చర్చించనున్న నేతలు
- ఇద్దరు డిప్యూటీలుగా, 12 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా, ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి తొలి సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారని, ఆయనే రాష్ట్ర సీఎం అని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. దీంతో గురువారం సీఎంగా రేవంత్ ప్రమాణం చేయనున్నారు. మరోవైపు ప్రకటనకు కొద్దిసేపటి ముందే ఢిల్లీకి రావాల్సిందిగా రేవంత్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో ప్రత్యేక విమానంలో హస్తినకు ఆయన బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. మరోవైపు మంత్రివర్గం, పోర్ట్‌ఫోలియోల కేటాయింపుపై హైకమాండ్‌తో చర్చించనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత మంత్రుల వివరాలను వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కేసీ వేణుగోపాల్‌తో భట్టి, ఉత్తమ్ భేటీ
మంగళవారం ఉదయం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన సమావేశంలో రేవంత్ పేరునే రాహుల్ గాంధీ సూచించారు. వారి సమావేశం పూర్తి కాగానే.. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో డీకే భేటీ అయ్యారు. సీల్డ్ కవర్‌తో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతున్న క్రమంలో డీకేని చివరి నిమిషంలో హైకమాండ్ వెనక్కు రప్పించింది.
కేసీ వేణుగోపాల్ నివాసంలో ఉత్తమ్, భట్టి, డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రేవంత్‌ను సీఎంగా కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.అంతకుముందు 2 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఎమ్మెల్యేల క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. రిజల్ట్ వచ్చిన తెల్లారే సోమవారం సీఎల్పీ ఎన్నిక సమావేశాన్ని నిర్వహించారు. ‘అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి సీఎంగా మాకు ఓకే’ అంటూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానాన్ని సీల్డ్ కవర్‌లో అధిష్టానానికి పంపారు.
సోనియా, ఖర్గే, రాహుల్‌కు ఆహ్వానం
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు రానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారిని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తున్నది. వారికున్న సమయాన్ని బట్టి ఆయా నేతలు వచ్చేది రానిది బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
రాహుల్ ఫోన్
ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ పూర్తి కాగానే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టు తెలిసింది. ‘సీఎం మీరే’ అని రేవంత్‌తో ఆయన చెప్పినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. దీంతో రెండు రోజులుగా హోటల్ ఎల్లాలోనే ఉంటున్న ఎమ్మెల్యేలంతా రేవంత్ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. సీఎల్పీ మీటింగ్‌లో ఎమ్మెల్యేల నుంచి వన్ టు వన్ అభిప్రాయాలను డీకే శివకుమార్ తీసుకోగా.. 42 మంది రేవంత్‌కు అనుకూలంగా ఓటేసినట్టు తెలుస్తున్నది. మంగళవారమంతా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక వచ్చే ఆరు నెలల పాటు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలుస్తున్నది.
మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తుండడంతో.. వారికి ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో అవగాహన క్లాసులను చెప్పించారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఏర్పాటు చేసిన హోటల్ ఎల్లా వద్ద సందడి వాతావరణం నెలకొంది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, కూనంనేని సాంబశివ రావు, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రేవంత్‌ను సీఎంగా ప్రకటించడం ఆలస్యం అవుతుండటంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘సీఎం రేవంత్’ అంటూ నినాదాలు చేశారు. ఇద్దరు యువకులు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు.
ఢిల్లీకి రేవంత్
అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా హోటల్‌లోనే ఉన్న ఆయన.. మంగళవారం సాయంత్రం బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బుధవారం హైకమాండ్‌తో కేబినెట్ కూర్పు, పోర్ట్‌ఫోలియోలపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లకు డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి వర్గంలో కీలక శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు రేవంత్‌ను సీఎంగా ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. సామాన్యులు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్దకు వెళ్లే వారికి పర్మిషన్లు ఇవ్వలేదు. సివిల్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.
హైకమాండ్‌కు థ్యాంక్స్
సీఎల్పీ లీడర్‌గా ఎంపిక చేసినందుకు హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, డీకే శివకుమార్, ఏఐసీసీ అబ్జర్వర్లకు మంగళవారం ఓ ప్రకటనలో థ్యాంక్స్ చెప్పారు.
ఇద్దరు డిప్యూటీలు.. మంత్రులుగా 12 మంది..!
సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులూ ప్రమాణం చేస్తారని తెలుస్తున్నది. బుధవారం హైకమాండ్ భేటీలో వీటిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కేబినెట్‌లో చోటుదక్కించుకునేది వీళ్లేనంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారానికి అధికారులు, కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియాన్ని మంగళవారం రాత్రి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.