
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్(NGT) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సెక్రటేరియట్ కూల్చివేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను NGT ఇవాల(సోమవారం,జులై-20) విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన NGT.. సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు కూల్చివేత జోలికి వెళ్లలేమని ఎన్‌జీటీ తేల్చిచెప్పింది. ఈ విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ NGT ఉత్తర్వులిచ్చింది. కూల్చివేతతో పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.