అంబేద్కర్ ముసుగు వేసుకుని కేసీఆర్ నాటకాలాడుతున్నారు : రేవంత్ రెడ్డి 

అంబేద్కర్ ముసుగు వేసుకుని కేసీఆర్ నాటకాలాడుతున్నారు : రేవంత్ రెడ్డి 

ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్లు కాదని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దళితులకు, మాల మాదిగలకు మంత్రివర్గంలో స్థానమేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ జంగ్ సైరన్ తోనే 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టి.. ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. TSPSC పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ కారణమని, పరీక్షలు సక్రమంగా నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మోడల్ అంటారా..? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన సభ నిర్వహించింది. నిరుద్యోగ నిరసన సభలో రేవంత్ రెడ్డి వెంట మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని 2018లో చెప్పి.. 51 నెలలు పూర్తైందని రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగ భృతి కోసం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. అంబేద్కర్ ముసుగు వేసుకుని కేసీఆర్ దొంగ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. ‘‘హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు’’ అని పేర్కొన్నారు. .

సన్నాసులను కేసీఆర్ మంత్రులను చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో వలసొచ్చిన కేసీఆర్ ను పాలమూరులో గెలిపించామన్నారు. తెలంగాణ వచ్చాక పాలమూరు బిడ్డలు వలస పోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం వలస పోదామో ఆలోచించండి అని ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొదట మొదలు పెట్టిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తర్వాత మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దే అని చెప్పారు. 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయంలోనే మొదలుపెట్టినవే అని రేవంత్ రెడ్డి చెప్పారు. వరదల్లో మునిగిన ఆలంపూర్ ప్రజలకు బంజారాహిల్స్ లో ఇల్లు అమ్మైనా ఇల్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. పేద విద్యార్థుల కోసం పాలమూరు యూనివర్సిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యాపకులను, సిబ్బందిని నియమించలేదని మండిపడ్డారు. యూనివర్సిటీలో 130 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నాడు చిన్నారెడ్డి 42మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంక్షను బలపరిచిన తర్వాతే 2001లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ కోసం నిరుపేదలు చనిపోయారని, బలహీన వర్గాల పిల్లల ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.