నీతి అయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీకి రేవంత్

నీతి అయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీకి రేవంత్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌‌‌‌లో శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. 2018 తర్వాత  తెలంగాణ సీఎం మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ‘వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్’ ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌‌‌‌ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు.. ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్‌‌‌‌లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై ఆయన ప్రసంగించనున్నారు. 

పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల కల్పనను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.  రాష్ట్రంలో అమలుచేస్తున్న రుణమాఫీ, వరికి బోనస్, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే సిలిండర్ సరఫరా, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లాంటి  కార్యక్రమాలను హైలట్ చేయనున్నారు. సామాజిక సాధికారత కోసం ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తీర్మానం వంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన రిలీజ్​ చేసింది.