రివ్యూ : గార్గి

రివ్యూ : గార్గి

అందరిలా రొటీన్ దారిలో వెళ్లకుండా కాస్త డిఫరెంట్‌గా అడుగులు వేయడంలో ముందున్న  లేడీ సూపర్ స్టార్  సాయిపల్లవి ... తాను నటించే సినిమాలపై అందరి దృష్టీ పడేలా అట్రాక్ట్ చేసుకుంటోంది. రీసెంట్‌గా ‘విరాటపర్వం’లో వెన్నెలగా నటించి ఇంప్రెస్ చేసిన ఆమె... నెల తిరక్కుండానే ‘గార్గి’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో సూర్య, తెలుగులో రానా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారని తెలియగానే అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలను ‘గార్గి’ అందుకుందా? ప్రేక్షకుడిని ఎంటర్‌‌టైన్ చేయడంలో సక్సెస్ అయ్యిందా? ఓసారి చూద్దాం.

కథేమిటంటే..

ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌‌గా పని చేస్తూ ఉంటుంది గార్గి (సాయిపల్లవి). ఆమె తండ్రి (శివాజీ) ఒక అపార్ట్మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్. ఆ అపార్ట్ మెంట్లో ఒకరోజు తొమ్మిదేళ్ల పాపపై అత్యాచారం జరుగుతుంది. అలా చేసింది గార్గి తండ్రేనంటూ అతణ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన తండ్రి అలాంటి పని ఎప్పటికీ చేయడని, ఆయన్ని కావాలనే ఇరికిస్తున్నారని గార్గికి అర్థమవుతుంది. పైగా ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ప్లేస్ లో అతణ్ని దాచిపెట్టడంతో ఆమె మరింత తల్లడిల్లిపోతుంది. తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. కానీ మైనర్ బాలిక రేప్ కేసు కావడంతో కేసు వాదించడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఓ జూనియర్ లాయర్ మాత్రం గార్గికి తోడుగా నిలబడతాడు. వాదించడం కూడా సరిగ్గా రాని ఆ లాయర్‌‌ సాయం గార్గికి ఉపయోగపడతాడా, ఆ న్యాయ పోరాటంలో ఆమెకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాటిని ఎలా అధిగమించింది, తన తండ్రిని కాపాడుకోగలిగిందా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..

మైనర్ బాలికపై అత్యాచారం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం రిస్కీ ఎలిమెంట్. ఈ రెండూ మిక్స్ అయ్యి ఉన్న సబ్జెక్ట్ ఇది. డీల్ చేయడం కాస్త అటూ ఇటూ అయితే విమర్శలు తప్పవు. కానీ ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు దర్శకుడు గౌతమ్ రామచంద్రన్. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంది. ఒక రియల్ ఇన్సిడెంట్ కి తన ఇమాజినేషన్‌ని జోడించి ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. అత్యాచారం అనేది మరిచిపోలేని గాయం. అది ఆ విక్టిమ్‌నే కాదు, తన ఫ్యామిలీని కూడా ఎంతో వేదనకు గురి చేస్తుంది. అయితే ఆ నేరం ఓ అమాయకుడిపై పడితే అతని కుటుంబం కూడా అంతే ఆవేదనను అనుభవిస్తుందనే విషయాన్ని ఎవ్వరూ గుర్తించరు. అతడు నిజంగా ఆ పని చేశాడా లేదా అనేది కూడా ఆలోచించకుండా రభస చేస్తారు. వదిలిపెట్టవద్దని, ఉరి తీయమని డిమాండ్ చేస్తారు. అతని కుటుంబాన్ని సైతం అవమానిస్తారు, వేధిస్తారు. అదే చూపించారు ఈ సినిమాలో. ఓవైపు అధికారులు ఒత్తిళ్లకి లొంగి తప్పులు చేస్తే అమాయకులు ఎలా బలైపోతారనేది కళ్లకు కట్టారు. మరోవైపు రేపిస్ట్ అనే ముద్ర పడితే ఓ వ్యక్తి జీవితం, అతని కుటుంబ గౌరవం ఏమవుతుందో చూపించారు. వారి మానసిక క్షోభని మనసుల్ని తాకేలా తెరకెక్కించారు. అలా అని ఎవరి పక్షాన నిలబడలేదు. ఎవరినీ వెనకేసుకు రాలేదు. ఎవ్వరినీ తక్కువ చేసీ మాట్లాడలేదు. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ఓ అమ్మాయి న్యాయపోరాటం యాంగిల్‌లోనే తెలివిగా డీల్ చేశారు. ఇక క్లైమాక్స్‌, కాన్సెప్ట్ లో ఉన్న మెసేజ్ కూడా మెప్పిస్తాయి. మంచి మార్కులు వేయిస్తాయి.  

ఏది ప్లస్?

ఈ సినిమాకి మొదటి ప్లస్‌ పాయింట్.. కథ. చాలా చిన్న లైన్. కానీ బరువైన స్టోరీ. అందరూ ఓన్ చేసుకోగల కథ. అమ్మో, మనకే ఇలా జరిగితేనో అని ఆలోచించి బాధపడిపోతాడు ప్రేక్షకుడు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి తన కూతురు తనని కూడా ఓ మగాడిలాగే చూసి భయపడుతోందంటూ పాప తండ్రి చెప్పే సీన్‌ కంటతడి పెట్టిస్తుంది. ఆ దుర్మార్గుణ్ని చంపేయాలని వెళ్లి, ఆ ఇంట్లో ఓ చిన్నపాట ఉండటం చూసి కత్తి పడేస్తాడు. ఆ పాపని ఎత్తుకుని ఏడ్చేస్తాడు. ఆ సీన్స్ ప్రేక్షకుడి గుండెను బరువెక్కిస్తాయి. ఇలాంటి ఎమోషనల్‌ కథలో సాయిపల్లవి భాగమైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. తన తండ్రిని అరెస్ట్ చేయడం, అతనిపై దాడి చేయడం లాంటి సీన్స్ లో ఆమె నటన చూసి ఫిదా అవ్వనివారు ఉండరు. ఈ కథకి ఆమె తప్ప మరొకరు న్యాయం చేయలేరు అన్నంత అద్భుతంగా నటించింది. ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయడం ఆమెకి కొత్తేమీ కాదు. తన నుంచి ఇలాంటి నటన ప్రేక్షకులకీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ మరింత బెస్ట్ ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది సాయిపల్లవి.

 ఇక లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ కూడా చాలా బాగా నటించాడు. తన కెరీర్‌‌లో ఇదో బెస్ట్ రోల్‌గా మిగిలిపోతుంది. మిగతా పాత్రధారులంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జడ్జ్ గురించి. దీనికి ఓ ట్రాన్స్ జెండర్‌‌ను తీసుకున్నాడు దర్శకుడు. దానివల్ల కొత్తదనమే కాదు.. సినిమాకి బలం కూడా చేకూరింది. ‘ఓ మగాడిలో పొగరు ఎక్కడ ఉంటుందో తెలుసు.. ఓ ఆడపిల్లలో నొప్పి ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఈ కేసులో తీర్పు చెప్పడానికి నేనే కరెక్ట్’ అంటూ ఆ జడ్జ్ చెప్పే డైలాగ్‌కి క్లాప్స్ కొట్టకుండా ఉండలేం. ఇక మంచి నిర్మాణ విలువలతో తీయడం వల్ల టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్ లో గార్గి ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. 

ఏది మైనస్?

ఎంత మంచి విషయాన్నయినా ఆకట్టుకునేలా చెప్పడంలోనే దాని విజయం ఉంటుంది. కానీ ఈ విషయంలోనే కాస్త తడబాటు కనిపించింది. అద్భుతమైన ఎమోషనల్ సీన్స్, ఆలోచింపజేసే డైలాగ్స్ ఉన్నప్పటికీ.. కథనంలో వేగం నెమ్మదించింది. కథ చాలా చిన్నది కావడం వల్ల ఈ సినిమా మొత్తం సీన్స్ పైనే ఆధారపడి ఉంది. దాంతో చాలా సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ ఒక్కోచోట కాస్త ఎక్కువయ్యాయేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సినిమా చాలా ఫాస్ట్ గా మొదలౌతుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్, అమ్మాయిపై అత్యాచారం, తండ్రిని అరెస్ట్ చేయడం వరకు పరుగులు తీస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కథ ఎంతకీ ముందుకెళ్లడం లేదేమోననే ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా సెకెండాఫ్‌లోని ఇన్వెస్టిగేషన్‌ విషయంలో దర్శకుడు ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అలాగే కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఇంకా షార్ప్ గా ఉండాలి.

‘జనగణమన’ సినిమా సెకెండాఫ్ మొత్తం కోర్టులోనే జరుగుతుంది. కానీ ఎక్కడా బోర్ కొట్టకపోవడానికి కారణం.. పృథ్విరాజ్ సుకుమారన్ కేసును వాదించే విధానం. ఇక్కడ కూడా అలాంటి షార్ప్ నెస్ ఉండివుంటే మరింత బాగుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీన్స్ కాస్త క్రిస్ప్ గా చేసుకుని, ఇంకాస్త తక్కువ నిడివితో తీసి ఉంటే ఈ సినిమాకి తిరుగు ఉండేది కాదు. అయితే సినిమాని ముగించిన తీరు మాత్రం అద్భుతం. అంతవరకు స్లో నేరేషన్ వల్ల ప్రేక్షకులు కాస్త నీరసించినా, చివర్లో వచ్చే ట్విస్టుకు మాత్రం ఇంప్రెస్ అయిపోతారు. 

చివరగా..

ఏవో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ గార్గిని మంచి సినిమా కాదనడానికి లేదు. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమానే. మన చుట్టూ సమాజంలో జరిగేదాన్నే దర్శకుడు సినిమాటిగ్గా చూపించాడు. ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. స్లో నేరేషన్‌కి విసుక్కోకుండా కాస్త ఓపికగా చూడగలిగితే ఒక మంచి చిత్రాన్ని చూసిన భావన తప్పకుండా కలుగుతుంది. ఎమోషనల్ మూవీస్‌ని ఇష్టపడేవారికి ‘గార్గి’ మరింతగా నచ్చుతుంది.

నటీనటులు: సాయిపల్లవి, కాళీ వెంకట్, ఐశ్వర్యలక్ష్మి, ఆర్‌‌.ఎస్.శివాజీ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణం: రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ రామచంద్రన్
రచన, దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్