
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 20 నెలల కాలంలోనే
విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థులు అనేక ఉద్యమాలు చేశారు. మొదటి మూడు సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం డీ.ఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయకుండా కాలయాపన చేసింది.
చివరికి డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్ట్ ఆదేశం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో 8,792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి రెండు సంవత్సరాల తర్వాత పోస్టులు భర్తీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు కోరగానే ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసి వేగంగా టీచర్ పోస్టులు భర్తీ చేశారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం టెట్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఉపాధ్యాయులకు మేలు జరుగుతున్నది. గతంలో టీచర్లకి ప్రమోషన్స్ అంతగా చేపట్టలేదు. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే రెండుసార్లు టీచర్ ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. 25 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టారు.
విద్యార్ధుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. మిడ్ డే మీల్స్ ధరలు కూడా సవరించారు. ఈ మధ్యే కొన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ప్రారంభించారు.
విద్యార్థులతోపాటు టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. టీచర్ ప్రమోషన్స్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి మరో డీఎస్సీ జారీ చేసి త్వరగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది.
- రావుల రామ్మోహన్ రెడ్డి-