వైరల్: పిల్లిని పట్టిస్తే రూ.15 వేల ఇనామ్ ఇస్తరంట

వైరల్: పిల్లిని పట్టిస్తే రూ.15 వేల ఇనామ్ ఇస్తరంట

గోరఖ్‌‌పూర్: తప్పిపోయిన పిల్లలను తెచ్చిస్తే ఇంత డబ్బు ఇస్తాం అనే ప్రకటనలు పత్రికల్లోనో, బస్టాపు గోడలపైనో చూసే ఉంటారు. కానీ ఇక్కడో మహిళ తాను ప్రాణంగా పెంచుకున్న పిల్లి పోయిందని, తెచ్చిస్తే అక్షరాలా రూ.15 వేలు ఇస్తాననడం విశేషం. ఆ మహిళ ఎవరో కాదు.. నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్ ఇలా శర్మ. ఇలా భర్త భారత మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ.

రీసెంట్‌‌గా గోరఖ్‌‌పూర్‌‌కు వెళ్లిన ఇలా శర్మ.. తనతోపాటు పెంచుకుంటున్న పిల్లిని కూడా తీసుకెళ్లారు. అయితే రైల్వే స్టేషన్‌‌లో రైలు శబ్దానికి భయపడిన పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమె ఆ పిల్లిని వెతికే పనిలో పడ్డారు. పిల్లిని తెచ్చిచ్చిన వారికి రూ.15 వేల నగదు బహుమతి ఇస్తానంటూ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌లో పోస్టులు పెట్టారు. అంతేగాక ఢిల్లీ వెళ్లాల్సిన ఇలా శర్మ గోరఖ్‌‌పూర్‌‌లోనే ఆగి.. ఆ సిటీ అంతటా పిల్లిని పట్టివ్వాలంటూ పోస్టర్లు అతికించారు. ఆ పిల్లి కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయని, దాని ముక్కుపై గోధుమ వర్ణంలో మచ్చ ఉంటుందని, వయస్సు రెండేళ్లు అంటూ పోస్టర్లలో రాయడం గమనార్హం. పిల్లి మిస్సింగ్ విషయంపై ఇలా శర్మ తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, సాయం కావాలని అడగడంతో వెతుకుతున్నామని గోరఖ్‌‌పూర్ ఎస్‌‌ఐ భ్రిజ్‌‌బన్ పాండే అన్నారు.