రివైండ్ టాలివుడ్ @ 2023..సక్సెస్‌ల కన్నా ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువ

రివైండ్ టాలివుడ్ @ 2023..సక్సెస్‌ల కన్నా ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువ

2023 తుది దశకు చేరుకుంది.  మరో ఎనిమిది రోజుల్లో  కొత్త ఏడాదికి వెల్‌‌కమ్ చెప్పబోతున్నాం. ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా టాలీవుడ్‌‌లో వందలాది సినిమాలు వచ్చాయి. అయితే  బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది సక్సెస్‌ల కన్నా ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్ద సినిమాలు ఎక్కువ ఫ్లాప్ టాక్‌‌ను అందుకున్నాయి. ఊహించని విధంగా చిన్న సినిమాలు అధిక సంఖ్యలో విజయాలు అందుకున్నాయి. ఫైనల్‌‌గా ఈ యేడు ఎవరెవరు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో చూద్దాం. 

బాలయ్య బొనాంజా 

ఈ ఏడాది అందరికీ కన్నా ఎక్కువగా నందమూరి బాలకృష్ణకు  కలిసొచ్చింది. సంక్రాంతి బరిలో ‘వీర సింహారెడ్డి’గా నిలిచి తనదైన మాస్ యాక్షన్‌‌తో ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు.  అలాగే దసరా సందర్భంగా ‘భగవంత్‌‌ కేసరి’గా వచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సక్సెస్‌‌ను అందుకున్నారు. అలా వరుస విజయాలతో బాలయ్య బొనాంజా కొనసాగించారు.  ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్నారు. 

మెప్పించని మాస్ మహారాజా 

సక్సెస్, ఫెయిల్యూర్స్‌‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. ఈ ఏడాది చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’తో విజయాన్ని అందుకున్నా.. సోలోగా మాత్రం సక్సెస్ అందుకోలేదు. ఈ యేడు ఆయన నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు రెండూ ఆశించిన ఫలితాల్ని రాబట్టుకోలేకపోయాయి.  దీంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ వచ్చే సంక్రాంతికి ‘ఈగల్’ సినిమాతో ఆడియెన్స్‌‌ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

లక్కీ లేడీస్ 

ఈ  ఏడాది వరుస విజయాలను అందుకున్న లక్కీ లేడీస్‌‌లో ముందు వరుసలో ఉంది హీరోయిన్ శ్రుతిహాసన్. ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్స్ అందుకుంది. రీసెంట్‌‌గా ‘హాయ్ నాన్న’లో స్పెషల్ రోల్ చేసి మెప్పించింది. తాజాగా ‘సలార్‌‌’‌‌తో మరో సక్సెస్‌‌ను తన ఖాతాలో వేసుకుంది శ్రుతి. నెక్స్ట్ ఈ రేసులో సంయుక్త మీనన్ ఉంది. ధనుష్‌‌ ‘సార్’తో సక్సెస్ అందుకుని, విరూపాక్షలో డిఫరెంట్ రోల్‌‌తో ఆకట్టుకుంది. ఫైనల్‌‌గా ‘డెవిల్‌‌’తో రాబోతున్న సంయుక్త హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక ‘బేబీ’ సినిమాతో వైష్ణవి చైతన్య, ‘సామజవరగమన’తో రెబా మోనికా జాన్, ‘దసరా’తో కీర్తి సురేష్, భగవంత్ కేసరి చిత్రంతో శ్రీలీల సక్సెస్‌‌లను అందుకున్నారు. 

సైడ్ అయిన స్టార్స్ 

ఈ ఏడాది మొత్తం ఆడియెన్స్ ముందుకు రాని హీరోలు కూడా ఉన్నారు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ లెవెల్‌‌లో గుర్తింపును అందుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ ఏడాది ప్రేక్షకులకు దూరమయ్యారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ ‘గేమ్ చేంజర్‌‌’లో నటిస్తుండగా, కొరటాల శివ డైరెక్షన్‌‌లో ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తవకపోవడంతో వీరిద్దరి సినిమాలు రిలీజ్‌‌కు నోచుకోలేదు. అలాగే పోయిన ఏడాది ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ‘పుష్ప2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్‌‌ మొదలు పెట్టడం ఆలస్యమవడంతో రిలీజ్ అవలేదు. 

ఇక ‘సర్కారు వారి పాట’తో సందడి చేసిన మహేష్​ బాబు కూడా ఈ ఏడాది సైడ్ అయిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్న మహేష్​ కూడా ఈ ఏడాదే రావాల్సి ఉంది. కానీ ఆయన కుటుంబంలో జరిగిన వరుస ఘటనలతో షూటింగ్‌‌కు బ్రేక్ పడుతూ వచ్చింది.  అలాగే పోయిన ఏడాది బంగార్రాజు, ఘోస్ట్ అంటూ ఆడియెన్స్ ముందుకొచ్చిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ తీసుకున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ చిత్రంలో నటిస్తున్నారాయన.  ఇక వెంకటేష్​ అయితే సిల్వర్ స్ర్కీన్‌‌కు దూరమైనా.. ‘రానా నాయుడు’ ద్వారా ఓటీటీలో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్‌‌లో ‘సైంధవ్’ చిత్రంలో వెంకటేష్ నటిస్తున్నారు.  ఈ ఏడాది బ్రేక్ పడిన వీరంతా ఉరికే ఉత్సాహంతో సంక్రాంతి నుంచి మొదలు బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్‌‌ను అలరించడానికి రెడీ అవుతున్నారు.

ఫినిషింగ్ టచ్ 

ఏడాది పొడుగునా ప్రతి వారం ఏదో ఒక సినిమా విడుదలవుతూనే ఉంటాయి. ఇక ఫైనల్‌‌ శుక్రవారం మాత్రమే మిగిలుంది. డిసెంబర్ 29న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’, సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన ‘బబుల్ గమ్’, వర్మ రూపొందించిన ‘వ్యూహం’ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాయి. మరి ఈ క్లైమాక్స్‌‌లోఎవరు సక్సెస్ అందుకుంటారో చూడాలి.   

డబుల్ ట్రీట్ 

ఈ ఏడాది రెండు చిత్రాలతో ఆడియెన్స్‌‌ను పలకరించాడు నాని. ‘దసరా’లో మాస్ రగ్డ్ గెటప్‌‌లో కనిపించి ఆకట్టుకున్న నాని.. ‘హాయ్ నాన్న’లో సాఫ్ట్ లుక్‌‌లో కనిపించాడు. దసరా సక్సెస్‌‌ను అందుకోగా, హాయ్ నాన్న పర్వాలేదనిపించింది.