RGV Vyooham Review: ఆర్జీవీ వ్యూహం రివ్యూ..ఎలా ఉందంటే?

RGV Vyooham Review: ఆర్జీవీ వ్యూహం రివ్యూ..ఎలా ఉందంటే?

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). 2023 నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని సెన్సార్ బోర్డు రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. ఆపై కొంతమంది కేసులు వేయడం..కోర్టు నిలిపివేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దీంతో ఆర్జీవీ వెనక్కడుగు వేయకుండా..పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో..ఎట్టకేలకు వ్యూహం సినిమాను ఇవాళ (మార్చి 2న) థియేటర్లలో రిలీజ్ చేశాడు.

సీఎం వైఎస్ జగన్ జీవితములోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా కావడంతో..ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అందరి అంచనాలకు తగ్గట్టుగా వ్యూహం ఉందో? లేదో తెలుసుకుందాం. 

కథ:

వ్యూహం సినిమా విషయానికి వస్తే కథ నిజ జీవితాలకు సంబంధించింది అయిన..ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయిన వీరశంకర్ రెడ్డి (వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) చనిపోయిన సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. వీరశంకర్ రెడ్డి మరణంతో రాష్ట్రం మొత్తం శోకసంద్రములో ఉండిపోతుంది. తండ్రి మరణంతో ఆయన కుమారుడు మదన్మోహన్ రెడ్డి (వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి) ఒక్కసారిగా షాక్ అవుతాడు. వీరశంకర్ రెడ్డి మరణానికి ముందు వరకు మదన్మోహన్ (జగన్‌) అంటే ప్రజలకు పెద్దగా తెలియదు. మదన్ కు తండ్రి అడుగుజాడల్లో నడవాలని..రాజకీయాల్లో చేరి ప్రజల మన్ననలను పొందాలని అనుకుంటాడు. అలా ఆయన తొలి అడుగు వేసి కడప ఎంపీగా గెలుస్తారు.

2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరశంకర్ రెడ్డి చనిపోవడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం మొదలవుతుంది. ఇక ఆ వెంటనే ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం..ఫలానా వ్యక్తి అంటూ కొన్ని రాజకీయపార్టీలు గుసగుసలు మాట్లాడుకోవడం జరుగుతుంది. మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే న్యాయం జరుగుతుందని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్‌ పార్టీ (కాంగ్రెస్‌) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు పంపిస్తారు.అయితే అందుకు భారత్ పార్టీ హై కమాండ్ మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడం ఒప్పుకోదు. దీంతో మదన్మోహన్ రెడ్డి భారత్ పార్టీని ఎదురించి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తాడు.అందులో భాగంగా జనాల మధ్యలోకి వెళ్లి..జనం సమస్యలను దగ్గరుండి తెలుసుకోని వారందరినీ ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు మదన్మోహన్ రెడ్డి. అదే సమయంలో మదన్మోహన్ రెడ్డి ఎట్టిపరిస్థితిల్లో ముఖ్యమంత్రి కాకూడదని..చంద్రబాబు (ఇంద్రబాబు) వేసిన వ్యూహం ఏంటి..? 

భారత్‌ పార్టీ మేడంను దిక్కరించి ఒంటరిగా రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లిన జగన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? 2009లో జగన్‌ సీఎం కాకుండా ఇంద్రబాబు (చంద్రబాబు) అండ్ కో టీమ్ వేసిన పన్నాగాలు ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు పూర్తి మద్దతు ఇచ్చిన శ్రవణ్‌ కళ్యాణ్‌ (పవన్ కళ్యాణ్)..2019 ఎలెక్షన్స్ లో ఇంద్రబాబు పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? ఇక ఒంటరిగా వెళ్లిన శ్రవణ్‌ కల్యాణ్‌ పన్నిన వ్యూహం ఏంటి? మరి అతన్ని ఇంద్రబాబు ఎన్ని విధాలుగా వాడుకున్నాడు? రాష్ట్ర ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్మోహన్ రెడ్డి ఎదుర్కొని ప్రజా నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు? కనీవినీ ఎరుగని రీతిలో మదన్ రెడ్డి ఎలా గెలుపు బావుటా ఎగురవేశాడు? అనేది  వ్యూహం సినిమా కథ.

విశ్లేషణ:

వ్యూహం సినిమా మొదలవుతూనే ఈ కథలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు అని వర్మ వాయిస్ ఓవర్ తో వస్తుంది. కానీ ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. అంతేకాదు..రెండు పార్టులుగా వ్యూహం, శపథం అంటూ ఆర్జీవీ ప్రకటించి అందరిలో ఇంట్రెస్ట్ పెంచారు. అలాగే ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేసరికి కొన్నిసెన్సార్ తిప్పలు తప్పలేదు.

ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో ఈ మూవీలోని పాత్రలకు నిజ జీవితంలో ఎవరికి పోలికలు లేవని..ఒకవేళ ఏవైనా పోలికలు ఉంటే అవి యాదృచ్ఛికమేనని సినిమా స్టార్టింగ్ లో వర్మ చెప్పుకొచ్చారు.

2009 లో వీరశంకర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడంతో పాటు ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత ఆయన కుమారుడు మదన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులకు లోనయ్యారు? తన తండ్రి ఆశయాలకు అడ్డుపడుతున్న వ్యవస్థను చూసి..ఆ  సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం కొత్త పార్టీని స్థాపించి..మదన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం..చివరికి కేంద్రాన్ని కూడా ఎదురించి తనను నమ్ముకున్న వారి కోసం చేసిన ఓదార్పు యాత్ర..ఆ యాత్రలో తెలుసుకున్న విషయాలు..ఇక ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు మదన్మోహన్ రెడ్డి ని అక్రమ ఆస్తుల కేసుల విషయంలో జైలుకి పంపడం వంటి సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. 

2014 ఎన్నికలను టార్గెట్ దిశగా ఇంద్రబాబు, శ్రవణ్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు ఎలా వెళ్లారు? ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? మదన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారు? వంటి విషయాలను వ్యూహంలో చూపించారు. ఆ తర్వాత అసలు లీడర్ కూడా అవ్వాలని అనుకోని మదన్మోహన్ ఎందుకు ప్రజలకు దగ్గర అవ్వాలి అనుకున్నాడు? ప్రజలకు ఏం చేయాలనుకున్నాడు? లాంటి విషయాలను చూపించారు.

వర్మ తెరకెక్కించిన వ్యూహం ప్రతి సీన్ ని గమనిస్తే..ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో చక్కగా ప్రసెంట్ చేశాడు. వీరశంకర్ రెడ్డి మరణం తర్వాత ఇంద్రారెడ్డి ప్రతి ఆలోచన ఎలా ఉంది? అప్పుడు ఆయన ఎలా రియాక్ట్‌ అయి ఉంటాడు? అనేది కూడా వర్మ చూపించారు. 

ఇక రాష్ట్ర ప్రజలు నమ్ముకున్న ఒక నాయకుడు చనిపోయినపుడు..ఆ ప్రజలు, ఒక కుటుంబ పెద్దను కోల్పోతే..ఒక ఫ్యామిలీ పడే బాధలు ఎలా ఉంటాయనేది వర్మ బయటకు తీశాడు..కష్ట సమయంలో మదన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్‌ ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. అయితే అన్ని వర్గాల వారికి సినిమా నచ్చకపోవచ్చు..కానీ, వైయస్ జగన్..ఆయన పార్టీని అభిమానించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి. 

నటీనటులు: 

జగన్ మోహన్ రెడ్డి గా నటించిన అజ్మల్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి చెప్పే డైలాగ్స్ వరకు అచ్చం జగన్ లా నటించి మెప్పించాడు. ఆయన భార్య మాలతి అనే పాత్రలో నటించిన మానస సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. జగన్ ను  ఓదార్చే సీన్స్, ధైర్యం చెప్పి ముందుకు నడిపించే సీన్స్ తో అందరినీ కదిలింపజేస్తుంది. చంద్రబాబు (ఇంద్ర బాబు) అనే పాత్రలో నటించిన ధనుంజయ్ లుక్స్ పరంగా మాత్రమే కాదు..నటన విషయంలో కూడా చంద్రబాబుని గుర్తొచ్చేలా చేశాడు.శ్రవణ్ కళ్యాణ్ పాత్రలో నటించిన పాత్ర ఆకట్టుకుంటోంది. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యారు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మార్క్ సినిమా ఇదని చెప్పుకునేలా తెరకెక్కించాడు. మధ్య మధ్యలో పాటలు, డైలాగ్స్ చెబుతూ వర్మ ఆకట్టుకున్నారు. సాజీశ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీత దర్శకుడు ఆనంద్ పాటల్లో ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.