వడ్లు కొనకుండానే కొన్నట్లు చూపి రూ. కోటి స్వాహా .. హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌లో వెలుగు చూసిన ఘటన

వడ్లు కొనకుండానే కొన్నట్లు చూపి రూ. కోటి స్వాహా .. హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌లో వెలుగు చూసిన ఘటన
  • మిల్లర్లు, అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు, ఐకేపీ నిర్వాహకుల చేతివాటం

శాయంపేట, వెలుగు : వడ్లు కాంటా వేయకుండానే, ఒక్క బస్తా కూడా మిల్‌‌కు తరలించకుండానే... కొన్నట్లు రికార్డులు సృష్టించి రూ. కోటి కాజేశారు. ఈ అక్రమంలో మిల్లర్లు, లోకల్‌‌ ఆఫీసర్లకు తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు సైతం భాగస్వాములయ్యారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌ మండల కేంద్రంలోని ఓ మిల్లర్‌‌ సీఎంఆర్‌‌ ఇవ్వకపోవడంతో సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు మిల్‌‌ను తనిఖీ చేయడంతో అక్కడ వడ్లు, బియ్యం ఏవీ కనిపించలేదు. దీంతో మిల్లర్‌‌కు కేటాయించిన వడ్లకు సంబంధించిన ట్రక్‌‌షీట్లను పరిశీలించారు. ట్రక్‌‌షీట్లు హనుమకొండ జిల్లా పత్తిపాక, కాట్రపల్లి గ్రామాలకు చెందిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల పేరుతో ఉండగా.. రైతుల పేర్లు మాత్రం కమలాపూర్‌‌కు చెందినవి కావడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌‌కు చెందిన ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌, విజిలెన్స్, సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు శాయంపేట మండల కేంద్రానికి చేరుకొని స్థానిక సురేఖ మండల సమాఖ్య ఆఫీస్‌‌లో ఎంక్వైరీ మొదలుపెట్టారు. 

ఆఫీసర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను వేర్వేరుగా విచారించి వివరాలు తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనకుండానే ట్రక్‌‌షీట్లు రాసి, ఆన్‌‌లైన్‌‌లో ఎంట్రీ చేయగా.. వాటిని దిగుమతి చేసుకున్నట్లుగా మిల్లర్‌‌ సైతం ఆన్‌‌లైన్‌‌లో ఎంట్రీ చేయడంతో చెల్లింపులు పూర్తి అయినట్లు గుర్తించారు. 

సాధారణంగా వడ్లు అమ్మే రైతులకు అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు టోకెన్లు జారీ చేస్తే.. వాటి ఆధారంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వడ్లు కొని ట్రక్‌‌ షీట్లు రాసిస్తారు. వడ్లు దించుకునే టైంలో మిల్లర్లు ట్రక్‌‌షీట్ల ఆధారంగా ఎంత ధాన్యం వచ్చింది అనే విషయాన్ని చూసుకుంటారు. కానీ ఇక్కడ వడ్లు, రైతులు లేకుండానే టోకెన్లు, ట్రక్‌‌షీట్లు ఇచ్చారన్న విషయంపై ఆఫీసర్లు విచారణ చేస్తున్నారు. తనిఖీల్లో స్థానిక సివిల్‌‌ సప్లై డీఎం మహేందర్, డీటీలు భద్రునాయక్, సదానందం పాల్గొన్నారు.