
మంచిర్యాల, వెలుగు: రెండేండ్లు గడుస్తున్నా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అప్పగించడంలో రైస్‌మిల్లర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం గడువుల మీద గడువులు పొడిగించడం వారికి అలుసుగా మారింది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు సర్కారు వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకోగా, మరికొందరు ఏకంగా వడ్లనే పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. మిల్లర్లతో అధికారులు మిలాఖత్ కావడంతో ఈ విషయం బయటకు రాకుండా లోలోపలే కప్పిపెడుతున్నారు. ఇక డెడ్లైన్లు ఉండవని, ఈ నెలాఖరులోగా పెండింగ్ సీఎమ్మార్ డెలివరీ చేయకుంటే యాక్షన్ తప్పదని సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో అలర్టయిన అధికారులు సీఎమ్మార్ టార్గెట్ పూర్తిచేయాలంటూ మిల్లర్లపై ప్రెజర్ తీసుకొస్తున్నారు. సీఎమ్మార్ బకాయి ఉన్న మిల్లర్లు గడువు లోపు డెలివరీ చేయకుంటే డీఫాల్ట్‌గా పరిగణిస్తూ బ్లాక్ లిస్టులో పెడుతామని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ మిల్లర్లను హెచ్చరించారు.
11వేల మెట్రిక్ టన్నులు పెండింగ్...
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర నుంచి సేకరించిన వడ్లను రైస్ మిల్లర్లకు అప్పగిస్తుంది. వాటిని మిల్లింగ్ చేసి క్వింటాలు వడ్లకు 67 కిలోల చొప్పున సీఎమ్మార్ కింద తిరిగి సర్కారుకు అప్పగించాలి. ఇందుకుగాను గవర్నమెంట్ మిల్లింగ్ చార్జీలను చెల్లిస్తుంది. కానీ మిల్లర్లు సకాలంలో బియ్యాన్ని ఇయ్యడం లేదు. దీంతో ప్రభుత్వం గడువులు పొడిగించడం కామన్ అయ్యింది. దీంతో జిల్లాలో గత రెండు మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంది. జిల్లావ్యాప్తంగా 50కిపైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 19 మిల్లులు టార్గెట్ పూర్తి చేయలేదు. ఈ మిల్లులకు 2021-22 వానాకాలం సీజన్లో 1,37,180 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించారు. వీటిని మిల్లింగ్ చేసి 91,910 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఎఫ్‌సీఐకి 5,804 మెట్రిక్ టన్నులు పోగా, 74,920 మెట్రిక్ టన్నులు సివిల్ సప్లయిస్కు ఇవ్వాలి. మొన్నటివరకు 11,187 మెట్రిక్ టన్నులు (386 ఏసీకేలు) బియ్యం మిల్లర్ల దగ్గరే పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ సీఎంఆర్‌కు సంబంధించిన 16,696 మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లర్ల దగ్గర ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ ఆ వడ్లు అసలు ఉన్నాయా? మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకున్నారా? లేక వడ్లనే పక్కదారి పట్టించారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పెండింగ్ ఉన్న మిల్లులు ఇవే....
మంజునాథ ఆగ్రో ఇండస్ర్టీస్ (ఇందారం) 3011 మెట్రిక్ టన్నులు, జైయోగేశ్వర ఇండస్ర్టీస్ (కొత్తూర్) 2056, బీఎస్వై రా రైస్‌మిల్ (ముదిగుంట) 912, అంబికాసాయి పారాబాయిల్డ్ (అందుగులపేట) 723, శివసాయి ఇండస్ర్టీస్ అండ్ మల్లికార్జున ట్రేడర్స్ (ఇందారం) 552, సాయిమణికంఠ ట్రేడర్స్ (నర్సింగాపూర్) 480, సదాశివ ఆగ్రో ఇండస్ర్టీస్ (పౌనూర్) 471, రామలక్ష్మణ్ ఇండస్ర్టీస్ (లింగాపూర్) 372, అష్టలక్ష్మి ఆగ్రో ఇండస్ర్టీస్ (టేకుమట్ల) 367, రాఘవేంద్ర ఇండస్ర్టీస్ (జన్నారం) 330, బాలాజీ ఆగ్రో ఇండస్ర్టీస్ (టేకుమట్ల) 293, సప్తగిరి ఆగ్రో ఇండస్ర్టీస్ (మందమర్రి) 261, శివమణి రైస్‌మిల్ (చెన్నూర్) 253, లక్ష్మీనర్సింహ రైస్మిల్లు (కలమడుగు) 215, లక్ష్మీగణపతి పారాబాయిల్డ్ (అందుగులపేట్) 172, కనకమహాలక్ష్మి (కిష్టంపేట) 167, వెంకటరమణ రైస్మిల్లు (పెద్దంపేట్) 155, ధనలక్ష్మి ఆగ్రో ఇండస్ర్టీస్ (ఇందారం) 152, లక్ష్మీసాయి ఆగ్రో ఇండస్ర్టీస్ (దొరగారిపల్లె) 148 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెండింగ్ ఉంది.
బ్లాక్ లిస్టుకు ఎక్కకుండా మిల్లర్ల పైరవీలు...
బ్లాక్ లిస్టులోకి ఎక్కకుండా ఉండేందుకు రైస్ మిల్లర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ద్వారా ప్రగతిభవన్ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ బ్లాక్ లిస్టులో చేరితే ఈ సీజన్ వడ్లను కేటాయించే అవకాశం లేదు. ఇప్పటికే జిల్లా అధికారులు ఈసారి ఈ మిల్లులను మినహాయించి మిగిలిన మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశారు. గడువులోగా సీఎమ్మార్ టార్గెట్ పూర్తి చేసినట్లయితే ఈ సీజన్లో సేకరించిన వడ్లను కేటాయించనున్నారు.