రైతులను దోపిడి చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు

రైతులను దోపిడి చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు
  • కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, మిల్లర్ల ఇష్టారాజ్యం
  • తరుగు పేరుతో లారీ లోడుకు రూ.50 వేల విలువైన వడ్ల కోత
  • రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు

 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెంలో జీసీసీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో డిసెంబర్​ 26న చెరుపల్లి, మారాయిగూడెం, భీమవరం, లచ్చిగూడెం రైతులు వడ్లు అమ్మారు. లారీలో బస్తాలను లోడ్​ చేసి భద్రాచలంలోని రాజుపేట శివారులోని రైస్ మిల్లుకు తీసుకెళ్లారు. వడ్లు తూర్పార పట్టలేదు, కల్తీ ఉన్నాయంటూ 25 క్వింటాళ్ల తరుగు తీశారు. రేసు ధర్మయ్య, కారం శ్రీరాములు, అప్పా నాగేశ్వరరావు, సోయం తిరుపతిరావు అనే రైతులు ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నష్ట పోయారు. ఈ ఒక్క లారీ నుంచే రూ.50 వేల విలువ చేసే వడ్లను తరుగు పేరిట రైసు మిల్లరు కోత పెట్టడంతో రైతులు లబోదిబోమంటున్నారు. డిసెంబరు 20న అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో పీఏసీఎస్​ కొనుగోలు కేంద్రంలో 4 కేజీల వడ్లు తీసుకుంటున్నారని రైతులు ధర్నా చేశారు. ఈ కేంద్రం నుంచి 6 లారీల వడ్లను తరుగు పేరుతో తీసుకుని మిల్లర్లకు పంపించారు.

 

భద్రాచలం, వెలుగు:భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకుల ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులు దగా పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల మేర వడ్లను తరుగు పేరుతో అదనంగా రైతుల నుంచి దండుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారంటూ తరచూ రైతులు ఆందోళన చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే 17 శాతం తేమ ఉండాలి. మట్టి, రాళ్ల బెడ్డలు, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం అంటూ సాకులు చూపుతూ నాణ్యత ఉన్నా తరుగు తీస్తున్నారు. 

ఓటీపీ సమస్య

జిల్లాలో 159 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నారు. 71 పీఏసీఎస్, 3 డీఆర్డీఏ, 17 జీసీసీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కేంద్రాల్లో ఇదే తరహాలో రైతుల నుంచి తీసుకుంటున్నారు. దీనికి తోడు హమాలీ చార్జీలు కూడా రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ఓటీపీ సమస్య రైతులను వేధిస్తోంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే  రైతు పేరు, మొబైల్​ నెంబరు, పట్టా నెంబరు ట్యాబ్​లో నమోదు చేసుకుంటున్నారు. ఇవన్నీ నమోదయ్యాక రైతు మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఇది కేవలం 2 నిముషాలు మాత్రమే 
ఉంటుంది. వెంటనే ఆ నెంబరు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు చెబితేనే ట్యాబ్​లో నమోదవుతాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో చాలా మంది రైతుల వద్ద ఫోన్లు ఉండడం లేదు. ఆధార్, పట్టా నెంబర్​ లింక్​ అయిన మొబైల్ ఫోన్​ ఉన్న రైతే కేంద్రానికి రావాలి. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

 

దోపిడీ చేస్తున్నారు..

కొనుగోలు కేంద్రాల్లో నిలువునా దోపిడీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాకు 1 కిలో అంటే 41 కేజీలు తీసుకోవాలి. కానీ 43 నుంచి 45 కేజీల వరకు తూకం  వేస్తున్నారు. బస్తాకు రెండు కిలోలంటే ఒక్కో రైతు ఎకరానికి రూ.2800 నష్టపోతున్నాడు. ఓటీపీతోనూ ఇబ్బందులు పడుతున్నాం. ఈ తిప్పల కంటే ఊళ్లోకొచ్చే దళారులకే అమ్ముకోవాలనిపిస్తోంది.
- రేసు ధర్మయ్య, రైతు, దుమ్ముగూడెం


విచారణ జరిపించాలి..

కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జరుగుతున్న మోసంపై విచారణ జరిపించాలి. తరుగు పేరుతో అదనంగా వడ్లు తీసుకుంటూ రైతులను దగా చేస్తున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఓటీపీ విధానంతో కౌలు రైతులు తిప్పలు పడుతున్నారు.
- కారం పుల్లయ్య, దుమ్ముగూడెం