మిల్లర్ల సన్న బియ్యం దందా.. వేల కోట్ల దోపిడీ

మిల్లర్ల సన్న బియ్యం దందా.. వేల కోట్ల దోపిడీ
  •  
  • ఖరీఫ్​లో క్వింటాల్ వడ్లకు పెట్టింది ​రూ. 2,600
  • క్వింటాల్​ బియ్యానికి అయ్యే ఖర్చు 4,600
  • మార్కెట్లో ప్రస్తుతం అమ్ముతున్నది 9వేల పైనే 
  • 34.42 లక్షల టన్నుల బియ్యం దగ్గర పెట్టుకొని కృత్రిమ కొరత
  • ఎల్​నినో బూచి చూపుతూ సామాన్యుడి జేబుకు చిల్లు
  • ఇప్పటికే సర్కారుకు వేల కోట్ల సీఎంఆర్ ఎగనామం 
  • ఇప్పుడు వినియోగదారులపై ధరల ప్రతాపం
  • బ్లాక్ దందాపై చోద్యం చూస్తున్న యంత్రాంగం 

హైదరాబాద్, వెలుగు: మిల్లింగ్​ కోసం సర్కారు ఇచ్చిన వడ్లను బయట అమ్ముకొని వేల కోట్లు వెనుకేసుకున్న మిల్లర్లు.. ఇప్పుడు సన్న బియ్యం దందాతో సామాన్యులకు చుక్కలు చూసిస్తున్నారు. 2025 వానాకాలం సీజన్‌‌లో రికార్డు స్థాయిలో సన్నాల దిగుబడి వచ్చినా, మార్కెట్‌‌లో కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం రేట్లను అమాంతం పెంచేశారు. ఖరీఫ్​లో క్వింటాల్ వడ్లకు రూ.2,600 చొప్పున కొని ఇప్పుడు క్వింటాల్​ బియ్యాన్ని రూ.8500 నుంచి రూ.9,500 వరకు విక్రయిస్తున్నారు. నిజానికి వడ్ల నిల్వ, మిల్లింగ్​, ప్యాకింగ్​, మార్కెటింగ్ ​చేస్తే క్వింటాల్​కు అయ్యే ఖర్చు రూ.4,600 లోపే. ఈ లెక్కన క్వింటాల్​కు రూ.7వేల చొప్పున అమ్ముకున్నా రూ.2,400 దాకా లాభం ఉంటుంది. కానీ ఎల్​నినో బూచి చూపుతూ, దిగుబడులు తగ్గుతాయనే  తప్పుడు ప్రచారంతో మిల్లర్లంతా సిండికేట్​అయ్యారు.

కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా సన్న బియ్యం రేట్లు పెంచేశారు.  మార్కెట్‌‌లో  రూ.1400 లోపే అమ్మాల్సిన 26 కేజీల బస్తాను  ఏకంగా రూ.2300 నుంచి రూ.2500 దాకా అమ్ముతున్నారు. నిజానికి ఇప్పుడు మార్కెట్​లో ఉన్నదంతా గత సీజన్ నిల్వలే. వీటిని ఆ రేట్ల ప్రకారమే అమ్మాలి. కానీ ప్రస్తుతం పెరిగిన వడ్ల రేట్లను చూపుతూ పాత స్టాక్​కు రేట్లు పెంచి అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఇంత బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. 


2025 వానాకాలం పంట గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రైతులు 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలను  సాగు చేశారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో 90.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్​కు  రూ.2,389 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి  రూ.2,889 చొప్పున చెల్లించి 39.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది.

మిగిలిన దాదాపు 51.38 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను ప్రైవేట్ మిల్లర్లు రైతుల తక్షణ అవసరాలను ఆసరాగా చేసుకుని చేజిక్కించుకున్నారు.  క్వింటాల్​కు కేవలం రూ.2,400 నుంచి రూ.2,800 లోపే చెల్లించి కొనుగోలు చేశారు. రైస్ మిల్లింగ్ శాస్త్రీయ నిబంధనల ప్రకారం 100 కిలోల ధాన్యాన్ని మరాడిస్తే కనీసం 67 కిలోల ముడి లేదా పాలిష్ చేసిన బియ్యం వస్తాయి ఈ లెక్కన మిల్లర్ల చేతికి ప్రైవేట్ కొనుగోళ్ల ద్వారానే ఏకంగా 34.42 లక్షల మెట్రిక్ టన్నుల నికర సన్నబియ్యం చేరింది. ఇంతటి అపారమైన ఆహార నిల్వలను గుప్పిట్లో పెట్టుకున్న వ్యాపార సిండికేట్, మార్కెట్ శక్తులను శాసిస్తూ ధరలను కృత్రిమంగా పెంచేసింది.

అన్ని మార్జిన్లు కలుపుకున్నా రూ.4,600 మించవద్దు.. 

బియ్యం ఉత్పత్తి వ్యయం లెక్కలను నిశితంగా గమనిస్తే మిల్లర్ల అక్రమ లాభాల దందా స్పష్టమవుతుంది. ఒక క్వింటాల్​ (100 కిలోల) నాణ్యమైన బియ్యం రావడానికి మిల్లింగ్ రికవరీ నిష్పత్తి ప్రకారం సుమారు 150 కిలోల (క్వింటాలున్నర) వడ్లు అవసరమవుతాయి. మిల్లర్లు క్వింటా వడ్లను సగటున రూ.2,600 చొప్పున కొనుగోలు చేశారనుకున్నా, 150 కిలోల ముడి ధాన్యానికి అయ్యే ఖర్చు రూ.4 వేల లోపు మాత్రమే.  

ఈ150 కిలోల వడ్లను మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే 50 కిలోల ఉప ఉత్పత్తులైన తవుడు (రైస్ బ్రాన్), నూకలు, పొట్టు విక్రయం ద్వారానే ప్రాసెసింగ్, కరెంట్ బిల్లులు, హమాలీ, రవాణా ఛార్జీలు పూర్తిగా భర్తీ అయి అదనపు లాభం వస్తుంది. బార్దాన్ ప్యాకింగ్, ఇతర నిర్వహణ ఖర్చులు, న్యాయబద్ధమైన మార్జిన్లు కలుపుకున్నా క్వింటా బియ్యం మిల్లు వద్ద ధర రూ.4,600 మించదు. అంటే హోల్‌‌‌‌సేల్‌‌‌‌గా కిలో రూ.46 వరకు పడే బియ్యాన్ని, రిటైల్ మార్కెట్​లో కిలో రూ.85 నుంచి రూ.95కి అమ్ముతూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి రెండు, మూడు నెలల కింది వరకు ఇదే బియ్యాన్ని రిటైల్​లో కిలోకు రూ.60 వరకు విక్రయించారు.  ఇప్పుడు  బియ్యం రకాన్ని బట్టి హైఎండ్​ ప్రీమియం, సూపర్​ ఫైన్​ పేరుతో  కిలోకు రూ.90 పైనే అమ్ముతున్నారు. 

సర్కారుకు వేల కోట్లు ఎగనామం.. 

మిల్లర్ల అక్రమ దందా బహిరంగ మార్కెట్ దోపిడీతోనే ఆగడం లేదు. ప్రభుత్వ ధాన్యం సేకరణ వ్యవస్థలోని లోపాల్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఏటా వేల కోట్లు కొల్లగొడ్తున్నారు.  ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గోదాములకు చేర్చాల్సింది పోయి, ఓపెన్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.  2014 నుంచి 2025 వరకు ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసి, మిల్లింగ్​కోసం  అప్పగించిన రూ. 13,400 కోట్ల విలువైన 59.95 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. ఇందులో నుంచి ఇప్పటివరకు రూ.7వేల కోట్ల దాకా రికవరీ చేయగా, మరో రూ. 6 వేల కోట్లకు పైగా ఇవ్వకుండా ప్రభుత్వానికి చుక్కలు చూపుతున్నారు.

గడిచిన వానాకాలంలోనూ  ప్రభుత్వం సేకరించిన 39.08 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, మరో 32.78 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యానికి సంబంధించి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను సకాలంలో అప్పగించకుండా ముప్పు తిప్పులు పెడ్తున్నారు. ఇలా ప్రభుత్వ ధాన్యంతో వ్యాపారం చేస్తూ, అటు సర్కారును, ఇటు సామాన్య ప్రజలను ఏకకాలంలో ముంచుతున్న అక్రమ మిల్లర్లపై  కొరడా ఝలిపిస్తూ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిల్లర్ల గోడౌన్లలో పేరుకుపోయిన పాత నిల్వలు ఎన్ని? వాటిని ఏ రేటుతో రైతుల వద్ద కొన్నారు? వాటి నిల్వ, మిల్లింగ్​, ఇతరత్రా చార్జీలు ఎన్ని? ఏ రేటుతో అమ్మాలి?  అనే అంశాలను పట్టించున్న నాథుడు లేడు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (నిత్యావసర సరుకుల చట్టం) ప్రకారం అక్రమ నిల్వలను జప్తు చేసే అధికారం ఉన్నప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే కళ్లు మూసుకుంటున్నారు. బియ్యం రేట్లను ఇష్టారాజ్యంగా పెంచి, సామాన్యుల నడ్డి విరుస్తున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని  ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి, సన్నబియ్యంపై తక్షణమే గరిష్ట రిటైల్ ధరను ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

కొత్త వడ్ల రేటు చూపుతూ.. పాత బియ్యం పెంపు.. 

ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న బియ్యం గత వానాకాలం సీజన్‌‌‌‌లో కొనుగోలు చేసి గోదాముల్లో భద్రపరిచిన పాత స్టాకే. వాస్తవానికి అప్పటి కొనుగోలు వ్యయాలు, నిల్వ ఛార్జీల ప్రకారమే విక్రయాలు జరపాల్సి ఉన్నప్పటికీ మిల్లర్లు కుమ్మక్కై ‘ఎల్​నినో’ బూచిని తెరపైకి తెచ్చారు. రాబోయే సీజన్లలోనూ కరవు ప్రభావం ఉంటుందంటూ మార్కెట్లో ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టించారు.

దీనికితోడు తెలుగు లోగిళ్లలో ‘పాత బియ్యం’ అన్నం వండితే పొడిపొడిగా వస్తుందనే సెంటిమెంట్‌‌‌‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఏడాది నిల్వ ఉన్న పాత బియ్యం పేరు చెప్పి సాధారణ ధర కంటే క్వింటాల్​కు అదనంగా మరో రూ.1000 నుంచి రూ.1500 వరకు అడ్డగోలుగా పెంచేశారు. నిజానికి కొత్త పంట నవంబర్, డిసెంబర్ నాటికే మార్కెట్లలోకి వచ్చినా, పాత నిల్వలను కృత్రిమంగా దాచిపెట్టి కొరత సృష్టించారు. ధరలు పెంచుకున్న తర్వాతే దశలవారీగా మార్కెట్‌‌‌‌లోకి వదులుతూ వినియోగదారులను దోచుకుంటున్నారు.