2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే అన్ని జట్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మెగా వేలం ఉండటంతో అన్ని జట్లు ఆటగాళ్ల రిటెన్షన్, కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళనపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను జట్టు నూతన హెడ్ కోచ్‌గా నియమించింది. ప్రస్తుత హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను తప్పించి జట్టు కోచింగ్ బాధ్యతలను పాంటింగ్‌కు అప్పగించింది.
ఈ విషయాన్ని ఇవాళ (సెప్టెంబర్ 18) ట్విట్టర్ వేదికగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అనౌన్స్ చేసింది. దీనిపై రికీ పాంటింగ్ స్పందించారు. "కొత్త హెడ్ కోచ్‌గా అవకాశం కల్పించినందుకు పంజాబ్ కింగ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. పంజాబ్ కింగ్స్ యజమానులు, మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. జట్టును పటిష్టం చేసి అభిమానులకు కొత్త పంజాబ్ టీమ్‌ను చూపిస్తా. సంవత్సరాలుగా ఫ్రాంచైజీతో ఉన్న అభిమానులు ఈ సారి నిరాశ చెందకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’’ అని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
పాంటింగ్ నియామకంపై పంజా కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ రియాక్ట్ అయ్యారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా అపార అనుభవం కలిగిన పాంటింగ్‌తో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. జట్టును పటిష్ట పరిచి విజయాలు అందించడంలో అతడి అనుభవం మాకు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు. వచ్చే 4 సీజన్లలో అతడితో కలిసి పని చేసేందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, రికీ పాంటింగ్‌తో ఉన్న ఏడేళ్ల బంధాన్ని ఇటీవల ఢిల్లీ తెంచేసుకున్న విషయం తెలిసిందే. పాంటింగ్ నేతృత్వంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఢిల్లీ అతడిని హెడ్ కోచ్‌గా తొలగించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా అపాయింట్ చేసుకుంది