పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం : చంద్రశేఖర్ రెడ్డి

పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం : చంద్రశేఖర్ రెడ్డి
  •     రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్​కలెక్టరేట్​లో పీఐవో అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు పర్వీన్, భూపాల్, కలెక్టర్ అభిలాష అభినవ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలక పాత్ర 
పోషిస్తుందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు త్వరగా పరిష్కరించాలని పీఐవో అధికారులను ఆదేశించారు. సమాచారాన్ని దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. ఆర్టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. 

నిర్మల్ జిల్లాలో ఆర్టీఐ అప్పీల్ కేసులను పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అనంతరం వివిధ సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీల్స్​పై హియరింగ్ (విచారణ) నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో కమిషనర్లు, కలెక్టర్ మొక్కలు నాటారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.