బ్యాటింగ్‌కు దిగితే చివరి వరకు క్రీజ్‌లో ఉంటా:రింకూ కాన్ఫిడెంట్ అదిరిపోయిందే

బ్యాటింగ్‌కు దిగితే చివరి వరకు క్రీజ్‌లో ఉంటా:రింకూ కాన్ఫిడెంట్ అదిరిపోయిందే

వరల్డ్ కప్ ముగిసింది. ప్రస్తుతం టీమిండియా దృష్టాంతా ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ పైనే ఉంది. ఈ సిరీస్ కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు కుర్రాళ్లకు అవకాశమిచ్చారు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో యువ ఆటగాళ్లు కంగారూల జట్టుకు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్ లో భాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు మొత్తం 5 టీ 20 లు ఆసీస్ తో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ తన జియో సినిమాతో మాట్లాడాడు. 
           
"నేను బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు 5-6 బంతులను ఎదుర్కోవాలనుకుంటున్నాను. నా ఆటతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తాను. ఆటను ప్రారంభించే ముందు చివరి 2-3 ఓవర్లలోకి  మ్యాచ్ ను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. చాలా వరకు ఈ  విషయంలో నేను  విజయం సాధిస్తాను" అని రింకూ చెప్పాడు. హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో రింకూ సింగ్ భారత జట్టులో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఫైనల్ వర్షం పడటంతో భారత్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దేశం కోసం పతకం గెలవడం చాలా ఆనందంగా ఉందని రింకూ ఈ సందర్భంగా తెలియజేశాడు. 

ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసిన రింకూ భారీ హిట్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో భారత టీ 20 జట్టులో స్థానం సంపాదించిన ఈ యువ ప్లేయర్ ఆడిన 5 టీ 20 మ్యాచుల్లో 208.33 స్ట్రైక్ రేట్‌తో 75 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో భారీ షాట్స్ కొట్టడంలో రింకూ సిద్ధహస్తుడు. దీంతో ఈ సిరీస్ కు ఫినిషింగ్ లో కీలకంగా మారనున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో రింకూ రాణిస్తే 2024 లో జరగనున్న వరల్డ్ కప్  రేస్ లో ఉంటాడు.