రింకూకు రిక్తహస్తమేనా..? ఆసియా కప్ జట్టులో చోటుపై నీలినీడలు

రింకూకు రిక్తహస్తమేనా..? ఆసియా కప్ జట్టులో చోటుపై నీలినీడలు

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ టీ20 టోర్నీకి ఇండియా టీమ్ ఎంపిక సెలెక్షన్ కమిటీకి పెద్ద సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో జట్టులో నిలకడైన ఆట కనబరిచిన ఆటగాళ్లతో పోటీ పెరిగిన నేపథ్యంలో ఫినిషర్ రింకూ సింగ్ ప్లేస్‌‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌‌లో తన మెరుపు బ్యాటింగ్‌‌తో వెలుగులోకి వచ్చిన రింకూ ఆ తర్వాత టీమిండియాలోనూ ఫినిషర్‌‌గా ఎదిగాడు. అయితే, గత టీ20 వరల్డ్‌‌ కప్ జట్టులో స్టాండ్‌‌బై ప్లేయర్‌‌గా మాత్రమే ఎంపికైన రింకూ కెరీర్‌‌‌‌లో వెనకబడ్డాడు. 

పైగా, గత రెండు ఐపీఎల్ సీజన్లలో అతని పాత్ర తగ్గిపోయింది.2024 సీజన్‌‌లో 113  బాల్స్‌‌, 2025 సీజన్‌‌లో 134  బాల్స్‌‌ మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇప్పుడు శుభ్‌‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లు తిరిగి వస్తుండడంతో సెలెక్టర్లకు టీమ్‌‌ ఎంపిక కష్టంగా మారింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఆల్‌‌రౌండర్ శివం దూబే, కీపర్ జితేష్ శర్మ వంటి మల్టీ టాలెంట్‌‌ ప్లేయర్లు ప్రత్యామ్నాయంగా  ఉండటం కూడా రింకూకు ప్రతికూలంగా మారింది.