
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన గొడవలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. భద్రతా దళాలు, కుకి తెగకు చెందిన వేర్పాటువాదుల మధ్య జరిగిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయాడు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు కక్చింగ్ జిల్లా సుగ్నులోని సెరౌ ప్రాక్టికల్ హైస్కూల్లో బీఎస్ఎఫ్ దళాలను మోహరించారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం తెల్లవారుజామున కుకి తెగకు చెందిన వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. దీంతో బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రంజిత్ యాదవ్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
ఈ నెల 10 దాకా ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కాల్పులు జరిపిన వేర్పాటువాదుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. మణిపూర్‌లోని సుగ్ను, సెరౌ ఏరియాల్లో కుకి తెగకు చెందిన వేర్పాటువాదులు ఎక్కువగా ఉంటారని వివరించారు. కాగా, ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఫాయెంగ్లో భద్రతాదళాలు, కుకి తెగకు చెందిన వేర్పాటువాదుల మధ్య కాల్పులు జరిగాయని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అల్లర్లు జరిగిన ఏరియాల్లో జూన్ 10, మధ్యాహ్నం 3 గంటల దాకా ఇంటర్నెట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అల్లర్లలో ఇప్పటి వరకు 98 మంది చనిపోగా, 310 మంది వరకు గాయపడ్డారు.