ఢిల్లీలో మళ్లీ మొదలైన అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు

ఢిల్లీలో మళ్లీ మొదలైన అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు

CAA అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. రాత్రి నుంచి హింసాకాండ తగ్గినా.. ఉదయం మళ్లీ  మొదలయింది. మౌజ్ పురి, బ్రహ్మపురిలో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆ ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. అక్కడ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది.

ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. పలు ప్రాంతాల్లో 144  సెక్షన్ విధించారు. మౌజ్ పురి, చాంద్ బాగ్, షహీన్ బాగ్‌లో పోలీసులు కవాతు నిర్వహించారు. కేంద్రం హోంశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బాబర్ పురి, గోకుల్ పులి, జోహ్రీ, శివ్ విహార్ మెట్రో స్టేషన్లను అల్లర్ల దృష్ట్యా అధికారులు క్లోజ్ చేశారు. అదే విధంగా ఈశాన్య ఢిల్లీలో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

నిన్న ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. అనేక ప్రాంతాలు అల్లర్లతో అట్టుడికాయి. జాఫ్రాబాద్, మౌజ్ పూర్  ప్రాంతాల్లో ఇళ్లకు, షాపులకు, వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిప్పు పెట్టారు. రెండు వర్గాలవారు ఒకరిమీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. అల్లర్లలో హెడ్ కానిస్టేబుల్ సహా ఐదుగురు చనిపోయారు. షాహ్ దరా డీసీపీ అమిత్  శర్మ గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. హింసాకాండకు సంబంధించి పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. అల్లర్లలో నిన్న గన్‌తో ఫైరింగ్ చేసిన షారూఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఢిల్లీలో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని, అవసరమైన ప్రాంతాలకు బలగాలను తరలించామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చిన రోజే అల్లర్లు జరగడం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద చాలా రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులు.. ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక సీఏఏ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే వ్యూహం ఉందంటున్నారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  కిషన్ రెడ్డి హెచ్చరించారు. హింసాకాండను కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంకా గాంధీ ఖండించారు.

For More News..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..

జమ్మూ కశ్మీర్‌లో మార్చి 4 వరకు ఇంటర్‌నెట్ సేవలు బంద్