IPL 2024: మూడోసారి అదే తప్పు.. పంత్‌పై నిషేధం పడే అవకాశం!

IPL 2024: మూడోసారి అదే తప్పు.. పంత్‌పై నిషేధం పడే అవకాశం!

శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన మ్యాచ్‌లో బ‌ల‌మైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ మట్టికరిపించిన విషయం తెలిసిందే.  వారి సొంత గడ్డపైనే ఓడించి.. రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీకి భారీ షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు కెప్టెన్ రిష‌భ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా జ‌రిమానా క‌ట్టిన పంత్.. ల‌క్నోపై అదే త‌ప్పును మూడోసారి పునరావృతం చేశాడు. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. అతను ఒక మ్యాచ్ నిషేధానికి గురి కావచ్చు.

లక్నో బ్యాటింగ్ సమయంలో 16వ ఓవ‌ర్‌కే ఓవ‌ర్ రేటు స‌మ‌యం దాటి పోయింది. దాంతో, ఆఖ‌రి ఓవ‌ర్‌లో నలుగురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బ‌య‌ట ఉన్నారు. ల‌క్నో మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు గురించి రిఫ‌రీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ‌ అదే జ‌రిగితే రూ. 30 ల‌క్షల జ‌రిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ప‌డే అవకాశం ఉంది.

స్లో ఓవర్ రేట్ రూల్స్ ఏం చెప్తున్నాయి..?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మొద‌టిసారి నిర్ణీత స‌మ‌యానికి ఓవ‌ర్ల కోటా పూర్తి చేయ‌లేక‌పోతే బౌలింగ్ కెప్టెన్‌కు రూ. 12 ల‌క్షల జరిమానా విధిస్తారు. రెండో సారి కూడా స్లో ఓవ‌ర్ రేటు కొనసాగిస్తే కెప్టెన్‌కు రూ.24 ల‌క్షలు, జ‌ట్టు స‌భ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత త‌ప్పదు. ఒక‌వేళ మూడోసారి రిపీట్ అయితే అప్పుడు ఆ జ‌ట్టు కెప్టెన్‌కు ఏకంగా రూ. 30 ల‌క్షల జరిమానాతో పాటు ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు. 

ఐపీఎల్ స్లో ఓవర్ రేట్ రూల్స్‌ను.. ఢిల్లీ అభిమానులు తప్పుబడుతున్నారు. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిన సమయాల్లో కెప్టెన్లు.. తొందరపాటు నిర్యాయాలు తీసుకోలేరని, కొంచెం సమయం పడుతుందని చెప్తున్నారు. స్లో ఓవర్ రేట్ నిబంధనలను సడలించాలని నిర్వాహకులను కోరుతున్నారు.  

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 167 పరుగులు చేయగా.. ఢిల్లీ బ్యాటర్లు 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. 168 ప‌రుగుల ఛేద‌న‌లో ఆసీస్ కుర్ర బ్యాటర్ జేక్ ఫ్రేజ‌ర్‌(55) రెచ్చిపోయాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మరో ఎండ్ లో పంత్(41) పరుగులతో పర్వాలేదనిపించాడు.