ఒక యాక్సిడెంట్ తన జీవితాన్ని తారుమారు చేసింది. కన్న కలలకు దూరం చేసి, బాధను మిగిల్చింది. అయినా, కుంగిపోలేదు. కష్ట పడ్డాడు. తన సమస్యకు సమాధానం కనిపెట్టాడు. చివరికి అందులో గెలిచాడు 28 ఏండ్ల రిషి కృష్ణన్. తన కథ ఏంటంటే..
తమిళనాడులోని వెల్లూరు రిషి సొంతూరు. అక్కడి డి.జి. వైష్ణవ్ కాలేజీలో బి.ఎస్.సి. డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చెన్నైలో మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్ జాబ్ చేసేవాడు. సెప్టెంబర్ 2019లో జరిగిన బైక్ యాక్సిడెంట్ వల్ల తన కుడి చేయి సగానికి తీసేయాల్సి వచ్చింది. చేయి లేకుండా జాబ్ చేయడం ఎలా? కుటుంబాన్ని చూసుకోవడం ఎలా? అని ఆలోచించేవాడు. చిన్న వయసులోనే కొడుకు ఇలా అయ్యాడని బాధపడేవాళ్లు రిషి తల్లిదండ్రులు. ఒక రోజు తెలిసినవాళ్ల ద్వారా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రోబోటిక్ చేయి పెట్టుకొని మామూలుగా పనులు చేసుకోవచ్చు అని తెలుసుకున్నాడు రిషి. డాక్టర్లను కలిసి వివరాలు కనుక్కుని చేతిని అమర్చుకున్నాడు. అయితే, రోబోటిక్ చేతులు అందరికీ సెట్ కావు. సరిగ్గా పని చేయవు కూడా. అలానే రిషికి కూడా ఆ చేయి సెట్ కాలేదు. సరిగ్గా పని చేయలేదు. ఎక్కువ బరువు కూడా ఉండేది. ఇవి కాకపోతే వేరొక మోడల్ తెప్పించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని చెప్పారు డాక్టర్లు. రిషి కూడా అలానే అనుకున్నాడు. కానీ, వాటి ధర 40 లక్షలకు పైనే ఉంటుంది. అంత డబ్బు పెట్టే స్తోమత లేని రిషి, రోబోటిక్ చేయి వద్దనుకున్నాడు. ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు. ‘ఇంత చదివి ఖాళీగా ఉండటం ఎందుకు. ఈ వయసులో తల్లిదండ్రులకు భారంగా ఎందుకు మారాలి’ అనుకునేవాడు. అప్పుడే తన ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ సాయంతో రోబోటిక్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. ‘ఇప్పటికీ అయిపోయింది ఏం లేదు. టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకొని నా చేయి నేనే తయారు చేసుకుంటా’ అనుకున్నాడు.
పుస్తకాలు చదివి..
ఏఐ రోబోటిక్ టెక్నాలజీ గురించి ఫ్రెండ్స్‌ని నేర్పించమన్నాడు. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించిన పుస్తకాలు తెప్పించుకొని సంవత్సరం పాటు చదివాడు. టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మెషిన్ ప్రాసెసింగ్, ఇఎంజి (ఎలక్ట్రోమయోగ్రఫీ)తో పాటు ఇతర సెన్సర్‌లను ఇంట్లోనే తయారుచేసి, వాటితో చేయి తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే, దానికి సంబంధించిన పూర్తి ఎక్విప్‌మెంట్ ఏదీ రిషి దగ్గర లేదు. దాంతో చేయి తయారుచేయడం కష్టమైంది. అప్పుడే విఐటి (వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) స్టూడెంట్స్ కొత్తగా ‘సింబోనిక్’ పేరుతో స్టార్టప్ పెట్టారు. వాళ్లకి తన ఐడియా చెప్పి సాయం చేయమని అడిగాడు రిషి. ఆ ఐడియా నచ్చి, వాళ్లు కూడా అందుకు ఒప్పుకున్నారు. వాళ్ల సాయంతో నవంబర్ 2021లో ఏఐ రోబోటిక్ చేయి తయారుచేసి, తనకే ఫిక్స్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉన్నా, మొదట్లో కొన్ని రకాల పనులు చేయడానికి చేయి సహకరించలేదు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని మళ్లీ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. చాలా రోజులు కష్టపడి, చివరికి దాంట్లో సక్సెస్ అయ్యాడు రిషి. తను తయారుచేసిన
రోబోటిక్ చేతితో ఇప్పుడు అన్ని రకాల పనులు చేయగలుగు తున్నాడు.
“నేను ఈ చేతిని సక్సెస్‌ఫుల్‌గా తయారుచేస్తా అనుకోలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధ పడుతూ కూర్చుంటే దీన్ని సాధించేవాడ్ని కాదు. కష్టాలు ఎదురైనప్పుడు దిగులు పడకూడదు. ధైర్యంతో ఉండాలి. రాబోయే నెలల్లో చెన్నై, బెంగళూరులోని హాస్పిటల్స్‌లో పేషెంట్ల మీద క్లినికల్ ట్రయల్స్ చేయబోతున్నాం. అది సక్సెస్ అయి, అందరికీ రోబో చేయి సరిపడితే, దానిపై పేటెంట్ తీసుకుంటాం. తరువాత లైట్ వెయిట్‌తో, అందరికీ అందుబాటు ఉండే ధరలో తీసుకొస్తాం” అని చెప్తున్నాడు రిషి.
