వెలుగు ఓపెన్ పేజీ.. ఎల్ నినో ఒక కారణం.. విపరీత వేడి నిజం

వెలుగు ఓపెన్ పేజీ.. ఎల్ నినో ఒక కారణం.. విపరీత వేడి నిజం

ప్రజలలో  ఈ ఎండాకాలంలో  పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల గురించి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు, పరిశోధకులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ, వాటిపట్ల తగినంత  శ్రద్ధ  కనపడలేదు. 1992లో  రియో శిఖరాగ్ర  సమావేశం అనంతరం 1995 నుంచి ప్రతి ఏటా వాతావరణ మార్పుల మీద అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి.  

ఇప్పటివరకు 30 సమావేశాలు జరిగినాయి.  ఆనాటినుంచి కూడా వేడెక్కుతున్న పుడమి గురించి మొదట్లో అంచనాలు, తరువాత హెచ్చరికలు, తదనంతరం కార్యాచరణ మీద ఈ సమావేశాలు దృష్టి పెట్టాయి. ఒక దశాబ్దం వరకు వాటిని ఉత్త మాటలుగానే  కొట్టిపారేశారు. ధనిక దేశాలు అయితే వాతావరణ మార్పులు భారత్ వంటి వర్ధమాన దేశాల వల్లనే  ఏర్పడుతున్నాయనే  నెపంతో పని చేశారు. క్రమంగా, ఒక శాస్త్రవేత్తల బృందం (IPCC) నిరంతరం శాస్త్రీయ అధ్యయనాల ద్వారా అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. వాతావరణ మార్పుల మీద జరుగుతున్న అంతర్జాతీయ సమావేశాలలో ఒక అర్థవంతమైన చర్చలకు ఇవి ఉపయోగపడుతూనే ఉన్నాయి. 

ఈనాటి విపరీత ఉష్ణోగ్రతల పరిస్థితి ఊహించనిది కాదని అంకెలతో, ఆధారాలతో చెబుతూనే ఉన్నారు.  మనమే  పట్టించుకోలేదు.   గత ఆరు సంవత్సరాలలో  కొవిడ్ అనంతరం,  వాతావరణ మార్పుల పట్ల,  విపరీత ప్రకృతి వైపరీత్యాల గురించిన  సమాచారం బాగానే ఇస్తున్నారు. అంతర్జాతీయ విశ్లేషణల మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే,  భూగోళం మీద జరిగే పరిణామాలు గురించి సమాచారం, వార్తలు, విశ్లేషణలు ఉన్నా,  స్థానిక కాలమాన పరిస్థితుల గురించి ఇప్పటికీ పూర్తిస్థాయి సమాచారం  లేదు. అవగాహన అంతకన్నా లేదు. శిలాజ ఇంధనాల ఉపయోగం, పట్టణీకరణ, అటవీ నిర్మూలన, తగ్గుతున్న  భూగర్భ జల మట్టాలు,  పట్టణ ఉష్ణ ద్వీప ప్రభావం వంటివి  కొనసాగుతున్న సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. 

కోల్‌‌‌‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు కాంక్రీట్ మౌలిక సదుపాయాలు, తక్కువ పచ్చదనం కారణంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలతో బాధపడుతున్నాయి.  సమస్య ఏమిటంటే ఇప్పటికి కూడా దీనిమీద పాలకులలో కించిత్ సోయి కూడా లేదు. వరదలు వస్తే  పాలకులు హెలికాప్టర్లు వేసుకుని పర్యటనకు పోతారు. మరి ఉష్ణోగ్రతలు పెరిగితే క్షేత్ర స్థాయిలో  రాజకీయ నాయకులు, పాలకుల పర్యటనలు ఏవి?  తమ ఏసీ గదులు,  ఏసీ కార్లు వదిలి రారేమి? 

ఎల్​నినో ప్రభావం

ఈ ఏడు  ఎల్​నినో  ప్రభావం భారత వాతావరణం మీద,  ఋతు పవనాల మీద, వర్షాల మీద ఉంటుందని భారత  వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఎక్కడో ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్​నినో పరిస్థితులు మన దేశ వాతావరణం మీద ఏ విధంగా,  ఎందుకు  దుష్ప్రభావం కలగజేస్తాయి?  గత  సంవత్సరం ఒక ప్రైవేటు సంస్థ ఎల్​నినో ప్రభావం ఉంటుంది అని చేబితే,  మన  వాతావరణ శాఖ ఆ హెచ్చరికతో విభేదించింది. ఈసారి మాత్రం అందరు ఎల్​నినో  ప్రభావం ఉంటుంది అని  కచ్చితంగా చెబుతున్నారు. లానినా  ఎల్​నినోకి  విరుద్ధం. ఇప్పటిదాకా ఉన్న  లానినా వల్ల మనకు వర్షాలు పడితే, ఇప్పుడు  ఎల్​నినో  వల్ల  వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  

పసిఫిక్ మహాసముద్రం భూమి ఉపరితలంలో మూడింట ఒక వంతును ఆక్రమించింది. కానీ దాని ప్రాముఖ్యత పరిమాణానికి మించినది. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థకు చోదక శక్తి  ఎల్​నినో - సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ)ను నడిపిస్తుంది.  ఇది ప్రతి ఖండంలో  వర్షపాతం, ఉష్ణోగ్రత, తుపానుల  సరళిని  ప్రభావితం  చేస్తుంది.  పసిఫిక్ జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు, 
భారతదేశం,  సహారా  ఆఫ్రికాను కరువుపట్టి పీడిస్తుంది, అదే సమయంలో పెరూ, ఈక్వెడార్‌‌‌‌లను  వరదలు నాశనం చేస్తాయి.  అవి చల్లబడినప్పుడు, రుతుపవనాలు తీవ్రమై, తరచుగా దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా వినాశకరమైన  వరదలను  తెస్తాయి. ఈ వరదలు మనం గత 4-5 ఏండ్లుగా చూస్తున్నాం.

గ్లోబల్ ​వార్మింగ్ ​వల్ల తీవ్రత

పసిఫిక్  సముద్ర జలాల వేడిలో  హెచ్చుతగ్గులు సహజమైనవే.  కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల దాని ప్రభావం తీవ్రత  పెరుగుతున్నది.  సముద్రపు వడగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి.  పవనాలు మరింత తీవ్రంగా దిశ మార్చుకుంటున్నాయి.  దీని పర్యవసానాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలపై  ప్రతి ఏటా తీవ్రమవుతున్నాయి. అందువల్ల, పసిఫిక్‌‌‌‌ ప్రాంతంలో వాతావరణ మార్పు తిరోగమనానికి ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, వాతావరణ అంచనాలను సాధ్యం చేసే పర్యవేక్షణ  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను బలోపేతం చేయాలి.  ఇది, ఒక అర్థవంతమైన రీతిలో, ప్రపంచం కోసం చేపట్టే వాతావరణ చర్య.  అభివృద్ధి చెందిన దేశాలు  ఈ పసిఫిక్ సముద్రం ఒడ్డున ఉన్నాయి. వారి పర్యావరణ విధ్వంసకర అభివృద్ధి నమూనా పసిఫిక్ సముద్రం మీద కనపడుతుంది. పసిఫిక్ సముద్రంలో మార్పులు ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం తగ్గాలంటే పసిఫిక్ సముద్రంలో జరుగుతున్న మార్పులు నిలువరించే విధంగా అభివృద్ధి చెందిన దేశాలు తక్షణమే చర్యలు చేపట్టాలి.

వడగాలుల ఉపశమన కార్యాచరణ ప్రణాళిక

తీవ్రమైన వేడి కారణంగా పెరుగుతున్న మరణాలను ఆపడానికి 2019లో  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఎ) మార్గదర్శకాలు జారీ చేసింది.  అయినప్పటికీ  రాష్ట్రస్థాయిలో చర్యలు లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ విక్రాంత్ తొంగాడ్ 2019లో  ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంతో సుప్రీంకోర్టులో  వడగాలుల  సన్నద్ధత   కేసు  ప్రారంభమైంది. కోర్టు ఈ పిటిషన్‌‌‌‌ను స్వీకరించి, స్థానిక వడగాలుల కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయమని కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాతి సంవత్సరాలలో  మరణాలు పెరుగుతున్నా, ఆదేశాల అమలు బలహీనంగా ఉండటంతో  కోర్టు పదేపదే ఆదేశాలు జారీచేస్తూ ఈ విషయాన్ని సజీవంగా ఉంచింది.  ఇది 2024 మే నెలలో పరాకాష్టకు చేరింది. ఆ సమయంలో కోర్టు తన జోక్యాన్ని తీవ్రతరం చేస్తూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను పిలిపించి వారి సన్నద్ధతపై వివరణ కోరింది. వడగాలులను ఒక జాతీయ విపత్తుగా పరిగణించడంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచింది. భారతదేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే  రికార్డుస్థాయి ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు  సతమతమవుతున్న  సందర్భంలో, మరణాలు సంభవిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్న అత్యంత కీలక సమయంలో  సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 

ప్రభుత్వం దిశానిర్దేశం చేయాలి 

 మే 2026 నాటికి భారతదేశంలో  సుమారు 300 కార్యాచరణలో ఉన్న వడగాలి నివారణ ప్రణాళికలు (హెచ్​ఏపీఎస్) ఉన్నాయి.  మరో 100 ప్రణాళికలు తయారీ దశలో ఉన్నాయి. దీంతో వాటి మొత్తం సంఖ్య సుమారు 400కి చేరుకుంది. 23 రాష్ట్రాలు వడగాలి నివారణ ప్రణాళికలను రూపొందించాయి, 270 జిల్లాలలో  వడగాలి నివారణ ప్రణాళికలు ఉన్నాయి, 64 నగరాలలో వడగాలి నివారణ ప్రణాళికలు ఉన్నాయి. అయితే, ఈ ప్రణాళికల సంఖ్య పెరుగుతున్నప్పటికీ  ఇవన్నీ మూస పద్ధతిలో  ఒకదాని నకలు ఇంకొకటిగా తయారు అయినాయి. సరైన ఆలోచన లేదు,  చాలా హెచ్ఏపీలు స్థానిక పరిస్థితులకు  అనుగుణంగా తయారు చేయలేదు.  వేడి, ఉష్ణోగ్రతలలో ఉండే వైవిధ్యం, అంతర్లీన సమస్యల మీద అవగాహన లేదు. అతి సరళీకృత దృక్పథాన్ని కలిగి ఉన్నాయి.  ప్రణాళికలు పేపర్ మీద ఉన్నాయి. అమలు కావడం లేదు.  

సందేశాలు కాదు, ఉపశమనం కావాలి

ఇప్పటికీ ప్రభుత్వం మంచినీళ్లు తాగండి, ఇంట్లో ఉండండి.  వడ దెబ్బ తగిలితే  ఓఅర్ఎస్ ప్యాకెట్లు కొనుక్కుని తాగండి వగైరా  సందేశాలకే  పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితులను 'వేడి విపత్తు'గా ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రకటించడానికి 2026  హెచ్​ఏపీలో  నిబంధన లేదు.  అటువంటి ప్రకటన అత్యవసరం. అధిక ఉష్ణోగ్రతలతో జరిగే మరణాలు నివారించడం ప్రభుత్వ బాధ్యత.  తెలంగాణ మంత్రివర్గం ఇప్పటివరకు దీని గురించి చర్చించలేదు. తగిన దిశా నిర్దేశం చేస్తే అన్ని ప్రభుత్వ విభాగాలు పని చేస్తాయి. రాజకీయ నాయకులు, పాలకులు ఇప్పుడు మాట్లాడకుంటే, ఇప్పుడు ఆలోచించకుంటే, ఉపశమనం వైపు అడుగులు వేయకుంటే, భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి.

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​