మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

 

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వెహికల్ ఓనర్స్‌‌‌‌కి చుక్కలు చూపిస్తున్నాయి. వరసగా ఏడు రోజుల నుంచి ఇంటర్నేషనల్‌‌‌‌గా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో.. ఇండియాలో కూడా ఫ్యూయల్ ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. బుధవారం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.84.45ను తాకింది. ముంబైలో రూ.91ను దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ కూడా బుధవారం 25 పైసల చొప్పున పెరిగాయి. ఈ విషయాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ ధరల నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నాయి. డీజిల్ ధర ఢిల్లీలో లీటరు రూ.74.63 పలకగా.. ముంబైలో రూ.81.34ను తాకింది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఈ మేర పెరగడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌‌‌‌లో కూడా లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.87.85కు చేరింది. లీటరు డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ.81.45 పలికింది.

గ్లోబల్ బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌లో బ్రెంట్ క్రూడ్ 47 సెంట్స్ పెరిగింది. అంటే బ్యారల్ 57.05 డాలర్లను అధిగమించింది. కిందటి సెషన్‌‌‌‌తో పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. కరోనా చైనా బయట ఇతర దేశాలకు విస్తరించే సమయంలో అంటే ఫిబ్రవరిలో బ్రెంట్ క్రూడ్ ధరలు ఈ మేర పలికాయి. అమెరికా క్రూడ్ ఇన్వెంటరీలు తగ్గిపోయాయనే డేటా బయటికి వచ్చాక ధరలు రికార్డులను తాకుతున్నాయి. అమెరికన్ పెట్రోలియం ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ డేటా ప్రకారం అంచనా వేసిన దానికంటే అధికంగా అంటే 5.8 మిలియన్ బ్యారల్ వరకు క్రూడ్ ఇన్వెంటరీలు తగ్గిపోయి 484.5 మిలియన్ బ్యారల్స్‌‌‌‌గా ఉన్నట్టు తేలింది. అంతేకాక ఆయిల్ ధరలను బ్యాలన్స్ చేసేందుకు సౌదీ అరేబియా ఉత్పత్తికి కోత పెట్టాలని చూసింది. కరోనా మహమ్మారి సమయంలో డిమాండ్ తగ్గిపోయి, మార్కెట్లోకి ఆయిల్ ఓవర్‌‌‌‌‌‌‌‌సప్లయి అయింది. ఆ సమయంలో సప్లయి అత్యధికంగా ఉంది. దీంతో ధరలు తగ్గాయి. కానీ ఇప్పుడు డిమాండ్ ప్రీ కరోనా లెవెల్స్‌‌‌‌కు రావడం, అంతేకాక ప్రొడక్షన్ కోతలు చేపట్టాలని నిర్ణయాలు తీసుకోవడం వంటివి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలను పెంచుతున్నాయి. కరోనా సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి ధరల సమీక్షను చేపట్టలేదు. వచ్చే కొన్ని రోజుల పాటు ఈ ధరల పెంపు ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు చెబుతున్నారు.

ఆయిల్ స్టాక్స్ జోష్…

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆయిల్, గ్యాస్ స్టాక్స్ కూడా పాజిటివ్‌‌‌‌గా ట్రేడవుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 4 శాతం వరకు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ 3.77 శాతం వరకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.45 శాతం వరకు, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ 1.82 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇతర గెయినర్స్‌‌‌‌లో గెయిల్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, పెట్రోనెట్ ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.

చివరిసారి ఆల్‌‌‌‌ టైమ్‌‌‌‌ హై 2018లో…

ఇంటర్నేషనల్ ధరలు, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం ఇండియాలో ప్రతి రోజూ డీజిల్‌, పెట్రోల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మారుస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ధరల ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో ఫ్యూయల్ ధరలను మార్చకుండా కంపెనీలు అలానే ఉంచాయి. కానీ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్ 57 డాలర్ల మార్క్‌‌‌‌ను దాటేసే సరికి, ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాల్సి వచ్చింది. వరుసగా రెండు రోజులు పెరిగిన ధరలతో పెట్రోల్‌‌‌‌పై 49 పైసలు, డీజిల్‌‌‌‌పై 51 పైసలు పెరిగింది. చివరి సారి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.84 ను 2018 అక్టోబర్ 4న తాకింది. ఆ రోజు డీజిల్ రేటు కూడా ఆల్ టైమ్ హైలో లీటరు రూ.75.45 పలికింది. వీటి ధరల వలన పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్‌ చేసేందుకు ప్రభుత్వం వెంటనే ఎక్స్చేంజ్ డ్యూటీని లీటరుకు రూ.1.50 తగ్గించింది. అంతేకాక ఆయిల్ కంపెనీలు కూడా మరో రూ.1 ధరను తగ్గించాయి.  2020 మే నుంచి లీటరు పెట్రోల్‌‌‌‌పై రూ.14.79, లీటరు డీజిల్‌‌‌‌పై రూ.12.34 ధర పెరిగింది.